Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్షేత్ర యంత్రములు

ముందునకును, వెనుకకును ఊగుచుండును. ఇట్లు ఊగుట వలన జల్లెడద్వారా పొట్టు క్రిందికి జారిపోవును. ఈ యంత్రములో వలయాకారముగా తిరుగు విసనకర్ర వంటి పరికరముండుటవలన గాలి ఉత్పత్తియగును. ఈ గాలి విసురువలన పొట్టుతోపాటు, చెత్తవంటి ఇతర పదార్థములు గూడ బయటికి పోగలవు. మిక్కుటముగా గాలి వీచని ఋతువుల యందు పక్వస్థితికి వచ్చిన పంటలను తూర్పారపట్టి శుభ్రము చేయుటకు ఈ యంత్రము మిక్కిలి తోడ్పడును. ఈ యంత్రము సగటున గంటకు 6 నుండి 8 బస్తాలవరకు ధాన్యమును శుభ్రపరచ గలదు.

చెఱకును చితుకగొట్టు యంత్రము : భారతీయ వ్యవసాయ విధానములో చెఱకును చితుకగొట్టు యంత్రము ప్రధానమయిన వ్యవసాయ యంత్రములలో ఒకటియై యున్నది. విపణి వీధిలో ఎద్దులచే నడుపబడు యంత్రములును, విద్యుచ్ఛక్తి చే నడుపబడు యంత్రములును, లభించును. ఈ యంత్రములు, రెండు పెద్ద రోలర్ల (rollers) చేతను, ఒక చిన్న రోలరు చేతను సులభపద్ధతిలో నిర్మింపబడుచున్నవి. ఈ రోలర్లు ఉక్కు స్తంభములపై అమర్చబడియుండును. సామాన్యముగా గ్రామీణ ప్రాంతములలో ఎద్దులచే నడుపబడు యంత్రములే ఎక్కువగా వాడుక యందున్నవి.

వేరుసెనగపొట్టు ఒలుచు యంత్రము (Decorticator): వేరు సెనగపొట్టు ఒలుచు యంత్రములు (decorticators)

చిత్రము - 45

వేరుసెనగ పొట్టుతీయు యంత్రము

పటము - 8

సులభ నిర్మాణము గలవియైనను మిక్కిలి సమర్థవంతముగా పనిచేయును. వేరుసెనగ కాయలోని పప్పు చితుకకుండ, పై పొట్టును మాత్రము వేరుచేయునట్లుగా ఈ యంత్రము నిర్మింపబడును. ఈ యంత్రములు వేర్వేరు ప్రమాణములలోను, వేర్వేరు సామర్థ్యముల (capacities) తోను తయారుకాబడును. ఇవి విద్యుచ్ఛక్తి వలనను, లేదా మానవశక్తి వలనను నడుపబడును. ఈ యంత్రములు పటిష్ఠములైన చట్రములమీద దృఢముగా నిర్మింపబడును. వీటి నిర్మాణము సులభమైనది. వీటి వాడకమును, పోషణమును తక్కువ వ్యయముతో సాధ్యమగును.

పర్షియన్ చక్రములు (wheels); పంపులు: 'పర్షియన్ చక్రము' అను పరికరము భారతదేశములో ఎక్కువగా వాడుకలోనున్న యంత్రము. ఉత్తర భారతములోని గ్రామసీమలలో నీరు తోడుటకు ఇది ముఖ్యమైన సాధనముగా ఉపయోగపడుచున్నది. ఈ సాధనము అనేక పరిమాణములలో, నమూనాలలో తయారగుచు, ఎప్పటికప్పుడు మార్పులు, అభివృద్ధులు పొందుచున్నది. కొన్ని నమూనాలలో పూర్వమున్న నిడుపైన కడ్డీ ఇటీవల తొలగింపబడినది; కొన్నిటియందు రెండు వరుసలలో బొక్కెనలు. అమర్చబడియున్నవి. ఈ యంత్రము సామాన్యముగా ఎద్దుల సహాయముతో పనిచేయును.

పలురకములైన నీటి పంపులు ఈనాడు విపణివీధిలో లభించుచున్నవి. సామాన్యముగా 'సెంట్రిఫ్యూగల్' మరియు 'ప్లంగర్' పంపులు వాడకమునందున్నవి. ఎద్దుల చేతను, మానవశక్తిచేతను పనిచేయు 'ప్లంగర్' పంపు లీనాడు లభ్యమగుచున్నవి.

నూనెగానుగలు (oil ghanis) : చమురుగింజలనుండి చమురుతీయుటకు ఎద్దులచేనడుపబడు గానుగలు (ఘనీలు) అను యంత్రములు భారతదేశమందు సామాన్యముగా ఉపయోగింపబడుచున్నవి. కాలమును పొదుపు చేసి కొనుటయందును, అధికతరమైన పరిమాణము గల చమురును తీయుటయందును, విద్యుత్ చోదితమైన యంత్రము ప్రయోజనకారిగా నుండగలదు. ఈ రెండు విధములయిన 'ఘనీలు' వివిధ పరిమాణములలో, వివిధ శక్తులలో లభ్యములగుచున్నవి.

155