Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షేత్ర - యంత్రములు

సంగ్రహ ఆంధ్ర

చిత్రము - 44

కోతయంత్రము

పటము - 7

సులభముగా నూర్చివేయగలదు. జపానుదేశములో ఒక విధమైన త్రొక్కుడు (pedal-operated) నూర్పిడి యంత్రము తయారు చేయబడినది. ఈ యంత్రమును భారత దేశములో గూడ ప్రయోగించి వరిపంటను మాత్రము నూర్పిడి చేయుటకు ఉపయుక్తమగునని నిర్ణయింపబడినది. కొన్ని భారతీయ పరిశ్రమలలో ఎద్దులచే నడిపింపబడుటకు వీలుగా నూర్పిడి యంత్రములు తయారు చేయబడుచున్నవి.

గింజలను పొట్టునుండి వేరుచేయుటను తూర్పారపట్టు విధాన (Winnowing) మందురు. భారతదేశములో ఎక్కువభాగము ప్రకృతిసిద్ధముగా వీచు గాలి సహాయముననే తూర్పారపట్టు కార్యకలాపము కొనసాగుచున్నది. దక్షిణ భారతదేశములో జనవరి, ఫిబ్రవరి నెలలలో జరుగు కోతల తరుణములో సహజమైన గాలి వీచును. కాని ఈ విధానమువలన కాలము వృధా యగుటయేగాక, యంత్రములవలె సమర్థవంతముగా తూర్పారపట్టు కార్యకలాపము జరుగనేరదు. ధాన్యము తూర్పారపట్టుటకు ఒక సులభమైన యంత్రమును మనుష్యుల సహాయముతో ఉపయోగింపవచ్చును. ఇది విసనకర్రవంటి (Winnowing fan) యొక సాధనము. దీనిని వడిగా త్రిప్పుటవలన బలమైన గాలి వీచి ఎత్తునుండి ధారగా పోయబడు త్రొక్కుడు గింజల (threshed grains) నుండి తేలికగా నుండు పొట్టు వేరై, శీఘ్రకాలములో అది కొట్టుకొని పోవును.

విద్యుచ్ఛక్తి వలనగాని, చేతులతో త్రిప్పుట వలనగాని, పనిచేయు ఇతరములయిన తూర్పార యంత్రములు కూడ కలవు. ఈ యంత్రముల పై భాగమున, నూర్పిడి కావలసిన ధాన్యమును ఒక తొట్టిలోపోసి ఉంచెదరు. ఈ తొట్టి నుండి ధాన్యము కొలది పరిమాణములో గొట్టముద్వారా అడుగుభాగమున ఒకదానిపై మరొకటిగా అమర్చబడిన జల్లెడలకు చేర్చబడియున్న అరల (nests) లోనికి క్రమముగా దిగుచుండును. ఒక జల్లెడకు మరొక జల్లెడకు నడుమ కొంత ఖాళీప్రదేశముండును. యంత్రము పనిచేయునపుడు జల్లెడలకు అమర్చియున్న అరలు (Nests)

154