Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్షేత్ర యంత్రములు

యంత్రము సులభమైనది, నాణ్యమైనది. ఈ యంత్రము వలన విత్తనములు భూమిలో సక్రమముగా, హెచ్చు తగ్గులులేక నాటుకొనును. ఎద్దులతోగాని లేక మరనాగళ్లతో (tractors) గాని లాగబడు ఈ యంత్రములకు అవసరమైన లోతులో విత్తనములను నాటుటకును, భూమియందు ఒక విత్తనమునకు మరియొక విత్తనమునకు మధ్య ఉండవలసిన దూరమును సవరించుకొనుటకును, ఒక యెకరము భూమిలో నాటవలసిన విత్తనముల ప్రమాణమును నిర్ణయించుటకును అవసరమైన ఉపసాధనములు అమర్చబడి యుండును.

దంతెలు (Cultivators) : ఒక శ్రేణిలో నాటుప్రత్తి, చెఱకు, వేరుసెనగ, పొగాకు వంటి వ్యవసాయమందు మాత్రమే 'దంతెలు' అను సాధనములు ఉపయోగపడును. ముఖ్యముగా కలుపును నిర్మూలించుటకు ఈ పరికరము అవసరమగును. బంగాళాదుంప, చెఱకువంటి వ్యవసాయములందు భూమిని క్రుళ్లగించుటకును లేదా కట్టలు నిర్మించుటకును కొన్ని అదనపు చేర్పులతో దంతెలు

చిత్రము - 43

దంతె

పటము - 6

ఉపయోగపడును. వేరువేరు వ్యవసాయ విధానములకు తగిన రీతిగా, అవసరమగు పద్ధతిలో ఈ దంతెలు నిర్మాణము చేయబడును. సాధారణముగా రెండెద్దులచే ఈడ్వబడు సాధనములకు 5 లేక 7 దంతెలు అమర్చబడును. దంతెల చివర అమర్చబడు పలుగులు ఉక్కుతో తయారు కాబడును. ఈ ఉక్కు పలుగులు అరిగిపోయినపుడు క్రొత్తవి అమర్చబడును. వీటిమధ్యగల దూరమును, భూమిలోనికి చొచ్చుకొనిపోవలసిన లోతును సమయానుకూలముగా ఎప్పటికప్పుడు మార్చుటకు వీలగును.

పంటలుకోయు పరికరములు, యంత్రములు :

(ఎ) కొడవలి : పంటలుకోయుటకు భారతదేశములో అనాదికాలము నుండియు కొడవలి అను సాధనము ప్రధానముగా వాడబడుచున్నది. ఈ కొడవళ్లు మామూలు అంచుగలవియు, ఱంపపు పళ్లవంటి అంచుగలవియు (కక్కు కొడవళ్లు) అని రెండురకములుగా నుండును. వంచుటకు వీలుకాని కందివంటి చెట్ల కొమ్మలను మామూలు అంచుగల కొడవలితోను; వంచుటకు వీలైన వరి, రాగి మొక్కలను కక్కు కొడవలితోను కోయుదురు.

(బి) రీపర్ : కత్తెరవంటి ఈ సాధనము బొత్తిగా పట్టుపట్టబడిన మొక్కలను కత్తిరించును. ఈ పరికరమును సామాన్యమైన మధ్యరకపు ఎద్దుల జతగాని, లేక చిన్నరకపు ట్రాక్టరుగాని ఈడ్చుకొని పోగలదు. కోయబడిన పదార్థము 'రీపర్‌'పై అమర్చబడిన ప్లాట్ ఫారమునందు తాత్కాలికముగా నిలువచేయబడును. ప్లాట్ ఫారమ్ నిండిన వెంటనే ఈ పదార్థము పొలములో ఒక ప్రక్కగా నిర్ణీతప్రదేశమునకు ఎప్పటికప్పుడు చేరవేయబడును.

జోడెద్దుల సహాయముతో 5 అడుగుల పొడవుగల కత్తి అమర్చబడిన 'రీపర్' గంటకు సగటున ముప్పాతిక నుండి 1 యెకరముమేర వరకు గల పంటను కోత కోయ గలదు. ఈ యంత్రముతో సమర్థవంతముగా కోత కోయవలె నన్నచో గింజలు ముక్కచెక్కలు కాకుండుటకై పంట పరిపక్వస్థితికి వచ్చునట్లు చూడవలయును. మామూలుగా కార్మికులు కోతకోయు కాలమునకు మూడు నాలుగు రోజులకు పూర్వమే ఈ యంత్రముతో కోత ప్రారంభము కావలెను.

నూర్పిడి, తూర్పారపట్టు యంత్రపరికరములు : సాధారణముగా భారతదేశమున ఎద్దులచేత నూర్పిడి చేయించి, కార్మికులచేత ధాన్యమును శుభ్రపరపించెదరు. ఈ విధానము వలన ఎక్కువ కాలయాపన జరుగుటయేగాక, భూమి దున్నుట కుపయోగపడవలసిన ఎద్దులు నూర్పిడి కార్యక్రమములో నియోగింపబడవలసి వచ్చును. ఇట్లుగాక, 40 యెకరములలో పండిన పంటను, 5 నుండి. 7 ఆశ్విక శక్తి (horse power) గల నూర్పిడియంత్రము

153