Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్యూరీసతి

ఏదో వ్రాత కాన్పించుచున్నదని పాశ్చాత్య ప్రయాణీకులు కనిపెట్టిరి. క్రీ. శ. 1802 లో గ్రొటెఫెండ్ అను జర్మను శాస్త్రజ్ఞుడు ఈ శాసన ప్రతులను సంపాదించి, వాటిని చదివి అర్థము చేసికొనుటకు ప్రయత్నించెను. ఈ శాసనము మూడు భాషలయందును, మూడు లిపుల యందును ఉన్నది. కాబట్టి దీనిని చదువుటకును, అర్థము చేసికొనుటకును వీలు కలిగెను. కొంతకాలమునకు పిదప ఇతర శాస్త్రజ్ఞులును, ముఖ్యముగ రాలిన్సన్ అనునొక ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడును కృషిచేసి, ఈ శాసనమునే కాక, ఇట్టి ఇతర శాసనములను గూడ సమగ్రముగ చదివి అర్థము చేసికొనగల్గిరి.

నాటినుండి నేటివరకును ఈ క్యూనిఫారమ్ లిపిలో వ్రాయబడిన శాసనములు లక్షలకొలదిగా దొరకినవి. వీటి నన్నిటిని చదివి అర్థము చేసికొనినందున ప్రాచీనచరిత్రకు సంబంధించిన విషయము లెన్నియో మనకు తెలిసినవి.

ఈ లిపి స్వరూపము కొంత బోధపడుటకు పారసీక రాజగు దరయస్ జరజస్ నామము ఎట్లు వ్రాయబడునో ఈ క్రింద చూడనగును. దరయస్ అను పదమును ప్రాచీన ఇరాన్ భాషలో వ్రాసినపుడు "ద్ అర్ ఇవ్ ఉష్" అని వ్రాయవలెను. కాబట్టి క్యూనిఫారమ్ లిపిలో నున్న శాసనములలో ఈ పదము ఈ క్రింది విధముగా వ్రాయబడి యున్నది:

చిత్రము - 26

ఈ రీతిగనే వ్రాయబడిన మరియొక పదముకూడ చూడవచ్చును —

చిత్రము - 27

పు. శ్రీ.


క్యూరీసతి (1867-1934) :

రేడియం, పొలోనియం అను మూలద్రవ్యములను విడదీసి, రేడియో ఏక్టివిటీపై పెక్కు పరిశోధనలు జరిపి, రెండుసార్లు 'నోబెల్ ' బహుమానము బడసిన ఈమె అసలు పేరు మేరీస్కొడోఫ్‌స్కా. ఈమె పోలెండు దేశములో 1867 సం॥ నవంబరు 7 వ తేదీన జన్మించినది. ఈమె తల్లి దండ్రులు వార్సాలో ఉపాధ్యాయులుగా పనిచేయుచు పాఠశాలయందు గణితశాస్త్ర, భౌతికశాస్త్ర, ప్రకృతి శాస్త్రములు బోధించుటలో హెచ్చుగా శ్రద్ధచూపించిరి. ఆ కాలములో పోలెండు దేశము రష్యను చక్రవర్తుల క్రింద బానిసత్వము అనుభవించుచుండెను. స్త్రీలకు ఉన్నత విద్య నభ్యసించుటకు వీలులేకుండెను. అందుచే స్కూలు వీడిన తరువాత మేరీ కొన్నాళ్ళు ప్రైవేటు టీచరు (గవర్నెస్) గా పనిచేసి, వలసిన డబ్బుగడించి, 1891 లో సొర్భోను విశ్వవిద్యాలయములో చదువుటకు పారిస్ నగరమున ప్రవేశించెను. అక్కడ పెక్కు కష్టములను ఓర్చి బీదరిక మనుభవించి, అన్ని పరీక్షలలో కడుసమర్థతతో నెగ్గెను. ఈమె 1894 వ సంవత్సరమున, వివిధ రకములైన

125