క్యూనీఫారమ్ లిపి
సంగ్రహ ఆంధ్ర
క్యూ
క్యూనీఫారమ్ లిపి :
క్యూనీఫారమ్, మిస్మారి, బాణలిపి, కీలలిపి, కోణలిపి, అని వేరువేరు పేర్లతో ప్రసిద్ధి చెందిన ఈ లిపిని బహుశః సుమేరియా ప్రజలు ప్రథమమున కనిపెట్టి ఉపయోగించి రని తోచుచున్నది. ఈ లిపియందు వ్రాయబడినప్రాచీనతమ శాసనములు మెసొపొటేమియా లేక ఇరాక్ లోనున్న యూఫ్రెటిస్, టైగ్రిస్ నదుల దిగువలోయ యందు గాన్పించుచున్నవి. ఉరుక్ (Uruk) లేక వర్క (Warka) అను ప్రదేశమున ఈ లిపిలో గాన్పించిన శాసనములు క్రీ. పూ. సుమారు 3500 సంవత్సరముల నాటివి కావచ్చును. ఇందలి అక్షరములు చాలవరకు చిత్రములవలె కాన్పించు చున్నవి. మేకులవలె గాన్పించు ఆకారము క్రీ. పూ. 3000 సంవత్సరముల వరకును ఈ అక్షరములకు ఏర్పడలేదేమో ? నాటినుండి ఈ కీల లిపి క్రీస్తు శకారంభము వరకును ప్రచురణములో నుండినట్లు శాసనములనుండి తెలియు చున్నది.
క్యూనీఫారమ్ అను పదము లాటిన్ భాషలోని క్యూనెక్స్ అను పదమునుండి ఏర్పడినది. ఈ లాటిన్ పదమునకు అర్థము గూటము. ఘంటముతో పచ్చిఇటుక రాళ్ళమీద వ్రాయబడిన ఈ అక్షరముల యందలి గీతలు ఆకారమునందు గూటములవలె ఒకవైపున వెడల్పుగను, రెండవ వైపున సన్నముగను ఉండును. కాబట్టి ఈ లిపికి గూటము లిపి అనుపేరు వచ్చినది. అరబ్బీవారు ఈ లిపి మేకులవలె నున్నదని తలంచి 'మిస్మారి' - మేకు లిపి లేక కీల లిపి - అని పేరిడిరి.
ఈ లిపిని వ్రాసిన ఫలకములు చాలవరకు మట్టిపలకలే. మట్టిని నీటితో కలిపి బాగుగా పిసికి చతురస్రాకారముగ చిన్న చిన్న ఫలకములుగనో, పెంకులుగనో తయారుచేసి, వాటిమీద తడి ఆరిపోక ఇంకను పచ్చిగ నున్నప్పుడే (మనము తాటియాకులపైన వ్రాయుట కుపయోగించు) ఘంటమువంటి దానితోనో లేక గట్టి కఱ్ఱముక్కతోనో ఈ అక్షరములను వ్రాసెడివారు. ఘంటమును పచ్చి పలకలో గ్రుచ్చినప్పుడు గూటము తలవలె నేర్పడి, అచటి నుండి గీచిన చక్కనిగీత గూటమువలె నుండి, మరల ఘంటమును పలక మీదినుండి ఎత్తివేసినపుడు మొనదేరి, మొత్తము గూటమువలెగాని, మేకువలెగాని గాన్పించును. అక్షరములందలి కొనలు కుడివైపునకుగాని, క్రింది వైపునకుగాని, ఏటవాలుగా కుడివైపునకుగాని ఉండును గాని, మీదికిగాని, ఎడమ వైపునకుగాని ఉండవు. రెండు గూటములు కలిసినపుడు మాత్రము రెండు మొనలును ఏటవాలుగా నుండును.
ఈ లిపిలోనున్న వ్రాతను చదివి అర్థము చేసికొనుట చాలకష్టము. ఏలయన, ఒక్కొక్క అక్షరము ఒక్కొక సందర్భమున సంపూర్ణపదమై సంపూర్ణార్థము నిచ్చును; మరియొక సందర్భమున ఒక పదములోని ఒక భాగముగ మాత్రమే యుండును. ఒక్కొక్క అక్షరమునకు ఒకే అర్థము కాక చాల అర్థములు కలవు. కాబట్టి ఈ అక్షరములు ఏ సందర్భమున ఉపయోగింపబడినవో, ఏ ఇతర అక్షరములతో చేర్పబడినవో జాగ్రత్తగా పరిశీలింపబడిన గాని సరియైన అర్థము తేలదు.
సుమేరియావారి కాలమున ప్రచారములో నుండిన క్యూనిఫారమ్ లిపి చాల క్లిష్టనిర్మాణమున నుండెను. సుమేరియన్ లిపియందు సుమారు 600 సంజ్ఞ లున్నవి. వీటితో పోల్చిచూచినయెడల వీరి కాలమునకు పిదప 'హిట్టైటులు' అనువారును, 'ఈలమైటులు' అనువారును, తమ లిపియం దుపయోగించిన 350 సంజ్ఞలును, 200 సంజ్ఞలును స్వల్పసంఖ్యయనియే చెప్పవచ్చును. తరువాత తరువాత ఇరాన్వారు ఉపయోగించిన సంజ్ఞలు కేవలము 39 మాత్రమే. సిరియా దేశమునందు జరిగిన ఖనన పరిశోధనమునందు కని పెట్టబడిన శాసనములనుండి కేవలము 30 సంజ్ఞలను మాత్రమే అక్షరములవలె నుపయోగించిన కీలలిపి యొకటి యుండెనని తెలియుచున్నది.
క్రీ. శ. 1800 ప్రాంతమునకు పూర్వమే లిపి శాస్త్రజ్ఞులు ఈ లిపిని చదువుటకు ఆరంభించిరి. పశ్చిమ ఇరాన్ ప్రాంతమునగల బేహిస్తన్ (Behistun) రాతికొండ పైకి నేలనుండి చూచినచో, సుమారు 300 అడుగుల ఎత్తున
124