Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కౌటిల్యుడు (రాజనీతిశాస్త్రము)

సంగ్రహ ఆంధ్ర

దాయము ననుసరించిన పండితులు కొందరు అతనికి తర్వాత మూడునాలుగువందల సంవత్సరములకు దానిని రచించిరనియు, ఒక వాదము కలదుగాని, అది సమర్థనీయమగు వాదము కాదు. గ్రంథమందలి


“సుఖగ్రహణ విజ్ఞేయం, తత్త్వార్థ పదనిశ్చితం
 కౌటిల్యేన కృతం శాస్త్రం, విముక్త గ్రంథవిస్తరం."
“సర్వ శాస్త్రాణ్యనుక్రమ్య ప్రయోగ ముపలభ్యచ
 కౌటిల్యేన నరేంద్రార్థే శాసనస్య విధిః కృతః."

ఇట్టి శ్లోకములు అతని కర్తృత్వమును స్థిరపరచు చున్నవి.

కౌటిల్యుడు తన గ్రంథమునకు అర్థశాస్త్రము అనుపేరు పెట్టియున్నను, అందు వివరింపబడిన విషయములు ఎక్కువగ రాజనీతికిని, దండనీతికిని సంబంధించియున్నవి. ప్రస్తుతకాలపు అర్థశాస్త్రములకును దానికిని ఇదియే భేదము. అది ఈకాలపు రాజ్యాంగ శాస్త్రగ్రంథములతో పోల్చదగియున్నది. ఆర్థిక, సాంఘిక వ్యవస్థలను రక్షించుట రాజధర్మమగుటచే, ఈ వ్యవస్థలను గురించిన వివరములు కూడ అందు చేర్పబడియున్నవి.

కౌటిల్యుని అర్థశాస్త్రమున పదునైదు అధికరణములును, నూట ఎనుబది ప్రకరణములును కలవు. ఇందు సూత్రములు, వాటిపై భాష్యము - ఈ రెండును కలిసి యున్నవి. ఇది ఇందలి విశేషములలో ఒకటి. సూత్రములను రచించినవారే స్వయముగ వాటిపై భాష్యములను రచించుట మంచిదని కౌటిల్యుని అభిప్రాయము. దీనిని


దృష్ట్వా విప్రతిపత్తిం,
          బహుధా శాస్త్రేషు భాష్యకారాణాం
స్వయమేవ విష్ణుగుప్త
         శ్చకారసూత్రంచ భాష్యంచ.

అను శ్లోకములో స్పష్టపరచియున్నాడు.

రాజ్యమునకు రాజుయొక్క దండనాధికారము ప్రధాన లక్షణమనియు, దండనము లేనియెడల మాత్స్యన్యాయము పుట్టుననియు, దండధరుడు లేనిచో, బలవంతుడు దుర్బలుని భక్షించుననియు, దండధరునిచే రక్షింపబడి దుర్బలుడు బాగుపడుచున్నాడనియు, ఈ కారణములచేత దండమునకు ఆవశ్యకము కలుగుచున్నదనియు కౌటిల్యుడు ప్రతిపాదించెను.

అవైదిక మతములను అభిమానించిన నంద చక్రవర్తిని తొలగించిన కౌటిల్యుడు, రాజులు దండసాధనమున వైదికధర్మమును నిలబెట్టవలెనని చెప్పుటలో ఆశ్చర్యము లేదు. అందుచేతనే అతడర్థశాస్త్రమందు వేదములకును చతుర్వర్ణములకును, చతురాశ్రమములకును సహజమగు ప్రాధాన్యమును కల్పించియున్నాడు. చతుర్వర్ణ చతురాశ్రమములు కలదియే లోకమనియు, రాజు వర్ణాశ్రమ స్థితికి కర్తయనియు, లోకము వేదముచేత రక్షితమై యున్నదనియు, రాజపుత్రుడు నేర్చుకొనవలసిన విద్యలలో వేదచతుష్టయ మొక్కటియనియు, స్వధర్మ పరిపాలకు డును, ఆర్య మర్యాదా వ్యవస్థాపకుడును, వర్ణాశ్రమస్థితి కర్తయునగు రాజు ఇహపర సౌఖ్యముల బొందుచున్నా డనియు, కౌటిల్యుడు చెప్పియున్నాడు.

బహుస్వామ్యము లగు రాజ్యములు కొన్ని అచ్చటచ్చట ఉండియున్నను, ఏకస్వామిక రాజ్యములే వాంఛనీయములని కౌటిల్యుని అభిప్రాయము. ఇంతేగాక, హిమవంతము మొదలు సముద్రము వరకును గల భూభాగమంతయు, చక్రవర్తి క్షేత్రమనియు, అందుచేత దానినెల్ల ఒక చక్రవర్తియే పాలించుట సమంజసమనియు అతడు చెప్పియున్నాడు. చంద్రగుప్తుడిట్టి ఆశయసిద్ధికే పాటుపడెను.

రాజ్యమును పాలించు సర్వాధికారము రాజ హ స్తగతమై యుండెను. ఈ అధికారము దుర్వినియోగము కాకుండుటకై రాజులు తమ పుత్రులను వినీతుల నొనర్చి సింహాసనార్హులను జేయుచుండిరి. అధార్మికుడగు రాజును ప్రజలు బలవంతముగ తొలగింపవచ్చునని అర్థశాస్త్రము చెప్పుచున్నది.

కార్యాలోచనమందు రాజునకు, మంత్రులకు తోడుగ మంత్రి పరిషత్తు సహాయముగ నుండెను. మంత్రులందరిలో అమాత్యుడు ప్రధానుడు. కార్యనిర్వహణమందు రాజ సమక్షమమునందుండి, రాజ్యముపై నెల్ల అధికారమును వహించినవారు కొందరు, రాజ్యములోని ఒక్కొక రాష్ట్రముపై అధికారము వహించుచుండిన వారు కొందరు, గ్రామముల మీదను, గ్రామ సముదాయముల మీదను, నగరములమీదను అధికారము వహించినవారు మరికొందరు ఉండిరి. మొదటి తరగతిలో, మంత్రి, యువరాజు, పురోహితుడు, సేనాపతి, దౌవారికుడు, అంత

122