Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కౌటిల్యుడు (రాజనీతిశాస్త్రము)

పీఠమునకు అధికారి యయ్యెను. కాని ఏకారణము చేతనో, చక్రవర్తియగు ధననందుడు ఇతనిని ఆ పదవినుండి తొలగించి ఇతని క్రోధమునకు గురియయ్యెను. ఇదిగాక కౌటిల్యుడు క్రుద్ధుడగుటకు మరియొకకారణము కూడ నుండెను. ధననందుడు ప్రజలను పీడించి ధనమును సమకూర్చు చుండుటకు తోడుగ అవైదికమగు జైనమతము ననుసరించి యుండెను. ఇది కౌటిల్యున కెంతమాత్రము గిట్టినది కాదు. అందుచేత ఇతడు ధననందుని రాజ్యభ్రష్టుని గావించుటకును, నందవంశమును నిర్మూలించుటకును, ప్రతిజ్ఞబూని దానిని కొనసాగింప కృతనిశ్చయుడయ్యెను.

ఈ ప్రయత్నములో ఇతడు చంద్రగుప్తుని చూచుట సంభవించెను. చంద్రగుప్తుడు మౌర్యవంశమునకు చెందిన క్షత్రియుడు. ధననందుని బంధువర్గములోని వాడనికూడ చెప్పవచ్చును. కాని శైశవముననే అతడు నందునిచే త్యజింపబడి ఒకగ్రామమున ఒక గొల్లవాని ఇంటనో లేక వేటకాని ఇంటనో పెరుగుచుండెను. దేశసంచారము చేయుచు కౌటిల్యుడు ఒకప్పుడు ఆ గ్రామమునుజేరి, చంద్రగుప్తుడు గ్రామములోని బాలుర ననేకులను జేర్చుకొని వారికి నాయకుడై వారితో ఆటలాడుచుండుట జూచెను. అతనియందు క్షత్రియలక్షణము లుండుటను కౌటిల్యుడు గ్రహించి, వేయిపణముల నతని పెంపుడు తండ్రికిచ్చి, అతనిని తనవెంట బెట్టుకొని తక్షశిలకు వెడలెను. అచ్చట క్షత్రియోచితములగు విద్యల నన్నిటిని అతనికి నేర్పెను. దానిఫలితముగ చంద్రగుప్తుడు యోధాగ్రేసరు డయ్యెను.

అప్పటికి (క్రీ. పూ. 327 - 325 నాటికి) గ్రీకులకు రాజై న అలెగ్జాండరు భరతఖండముపై దండెత్తి, అందులోని వాయవ్య భాగమును జయించి, దానిని పాలించుటకు తన ప్రతినిధులను కొందరిని నియమించి, వెనుకకు వెడలిపోయెను. మాతృదేశము విదేశీయుల పరిపాలనకు లోబడియుండుట కౌటిల్యుడును, చంద్రగుప్తుడును సహించినవారు కారు. “వై రాజ్యమున (విదేశీయుల పరిపాలనమునకు లోబడిన రాజ్యమున), ప్రభువురాజ్యము తన స్వభూమి కాదని తలచుచు కర్శనాపవాహనము లొనర్చును; లేక రాజ్యమును పణ్యముగజేసి లాభ మొందుటకు యత్నించును" అని అర్థశాస్త్రమందు కౌటిల్యుడు చెప్పియేయున్నాడు. ఇవి గ్రీకుల పరిపాలనానుభవము నాధారముగ జేసికొని చెప్పినమాటలని తోచుచున్నది. విదేశీయపరిపాలన మూలమున కలిగిన ప్రమాదములనుండి ప్రజలను రక్షించి దేశమునకు స్వాతంత్ర్యమును సంపాదించుటకై కౌటిల్య, చంద్రగుప్తులు తీర్మానించుకొనిరి. అందుకై వారు శస్త్రోపజీవు లగు వారితో కూడినట్టియు, హిమాచలప్రాంతములోని పార్వతీయులతో కూడినట్టియు, సైన్యమును సమకూర్చుకొని గ్రీకులను, వారి ప్రతినిధులను యుద్ధమందు ఓడించి, ఇప్పటి పంజాబు, సింధు రాష్ట్రములను వశపరచుకొనిరి. కౌటిల్యుని బుద్ధిబలమును, చంద్రగుప్తుని భుజబలమును కలిసి సాధించిన విజయములలో ఇది మొదటిది.

అటుతర్వాత వారిద్దరు గొప్ప సైన్యములతో నంద రాజ్యముపై దండెత్తి, నందుని ఓడించి, సామ్రాజ్యమును వశపరచుకొనిరి. చంద్రగుప్తుడు సామ్రాజ్యమున కెల్ల పట్టాభిషిక్తుడయ్యెను. కౌటిల్యుడతనికి ప్రధానామాత్యుడై అర్థశాస్త్ర సిద్ధాంతానుసారముగను, ప్రాచీన ధర్మానుసారముగను, రాజ్యపరిపాలనము నడపించి కాలధర్మ మొందెను. తాను చంద్రగుప్తునికి తోడ్పడిన విధమును స్మరించుచు, కౌటిల్యుడు అర్థశాస్త్రమందు,


“యేన శాస్త్రంచ శస్త్రంచ నంద రాజగతాచ భూః
అమర్షేణోద్ధృతాన్యాశు తేన శాస్త్రమిదం కృతం.

అని వ్రాసియున్నాడు.

కౌటిల్యుని ప్రఖ్యాతికి అతడు రచించిన అర్థశాస్త్రము కూడ దోహదమొసగుచున్నది.

ఆతనికి పూర్వమును, అతని యనంతరమును అనేకులు అర్థశాస్త్రములను రచించిరిగాని, అన్నిటిలో ఆతనిదే ఉత్తమోత్తమ మైనదని చెప్పదగియున్నది. రాజ్య సంపాదన, పరిపాలనమునకు సంబంధించిన వివిధ విషయములను ఆతనివలె విపులముగ వివరించిన వారెవ్వరు లేరు. ఇదిగాక, కౌటిల్యుడు పండితుడుమాత్రమే కాక లౌకిక వ్యవహారములందును అత్యంతానుభవము సంపాదించిన వాడు. అందుచేత అతడు వివరించిన పరిపాలనవిధానము ప్రయోగాధారమై, ఆచరణయోగ్యముగ నున్నది.

ప్రస్తుతము ప్రచారములో నుండు కౌటిల్య అర్థశాస్త్రము అతడు విరచించినది కాదనియు, అతని సంప్ర

121