విజ్ఞానకోశము - 3
కొలంబియా
1493 అక్టోబరులో కొలంబసు రెండవ పర్యాయము సముద్రయానము చేసెను. ఈ పర్యాయ మతనికి 17 ఓడలు లభించెను. 1500 మంది నావికులు స్వచ్ఛందముగా వచ్చిరి. కొలంబసు కొంతదూరము ప్రయాణము చేసిన పిదప తన అనుచరులను 'హిస్పానియోల' ద్వీపమున (దీనిని ఇప్పుడు హెయిటీ దీవి అందురు) దింపి తాను క్రొత్త ప్రదేశములను కనుగొనుటకు వెళ్ళెను. గ్రేటర్ ఆంటిలీస్ అని నేడు పిలువబడు దీవుల పెక్కింటి నాతడు కనుగొనెను. సంవత్సరమైన పిదప తిరిగి హిస్పానియోలను చేరుకొనెను. కాని అచ్చట అతడు దింపిన అనుచరులు బంగారముమీద పేరాసతో మూర్ఖముగా స్థానిక ప్రజలతో కలహించుటచేత వారిచే వధింపబడిరి. కొలంబసు తిరిగి స్పెయినుకు వెళ్ళెను.
1498 వ సంవత్సరమున కొలంబసు తన మూడవ సముద్రయానమును సాగించెను. ఈ పర్యాయ మాతడు ఆరు ఓడలతో బయలుదేరెను. ఈమారు ఆతడు నైరృతి దిక్కున ఇంకను దూరముగాపోయెను. మార్గ మధ్యమున మూడు ద్వీపములను కనుగొనెను. వాటి కాతడు ట్రినిడాడ్ అని పేరుపెట్టెను. పిమ్మట దక్షిణ అమెరికా సముద్రతీరము ననుసరించి 'ఓరినోకో' నదీ ముఖము వరకు నాతడు ప్రయాణము చేసెను. ఈమధ్య అతడు ఎచ్చటను భూమిపై దిగుటకు వీలుపడలేదు. అతడు చూచిన నదీముఖమునుండి నీరు పుష్కలముగా సముద్రములో పడుచుండెను. కాబట్టి అదియొక ద్వీపమునుండి పారు నది కాదనియు, ఒక పెద్ద భూఖండమునుండి మాత్రమే అంతటి నది ప్రవహించగలదనియు కొలంబసు గ్రహించెను. తానొక క్రొత్త ఖండమును కనుగొన్నట్లు ఆత డూహించ దొడగెను. కొలదిరోజులలోనే కొలంబసు 'పారా'అఖాతమున ఒకచోట దక్షిణఅమెరికాలో దిగెను. అది ఇండియాయే అని కొలంబసు ఊహించెను. కాని అది ఇండియా కాదు. అమెరికా అనునొక క్రొత్తఖండము.
1502 వ సంవత్సరమున కొలంబసు తన తుది సముద్రయానమునకు బయలుదేరెను. మొదట నాతడు పశ్చిమ ఇండీసు వైపుగా ప్రయాణము సాగించెను. ఆ తరువాత జమైకా వెళ్లి నేడు 'హండూరాస్' ఉన్న తావున మధ్య అమెరికా తీరమునకు చేరెను.
1504 వ సంవత్సరమున కొలంబసు స్పెయిను చేరుకొనెను. మార్గమధ్యములో అతడెన్నో అవమానములకు, కష్టములకు గురియయ్యెను. అతడు స్పెయిను చేరుకొను సరికి దురదృష్టవశాత్తు ఇసబెల్లా రాణి మిక్కిలి అస్వస్థతలో నుండి ఆతనికి దర్శన మియ్యలేకపోయెను. కొలంబసు కూడ జబ్బు పడెను. రాణి చనిపోయెను. కొలంబసుకు స్వస్థత చిక్కిన తరువాత అతడు ఫెర్డినాండు రాజును సందర్శించ బోయెను కాని రాజు కొలంబసును అభిమానించి ఆదరించలేదు. కొలంబసువలన ఇక ప్రయోజన మేమియని రాజు భావించి ఉపేక్ష వహించెననికూడ కొందరు చెప్పుదురు. ఏమైనను ఆదరించువారు లేక కొలంబసు నిరుపేదయై, అనేక కష్టములకు లోనై, మరల అస్వస్థుడయి 1506లో పరలోక గతుడయ్యెను.
నూత్న ప్రపంచమని చెప్పబడు అమెరికా ఖండమును కనుగొన్న మహాపురుషుడు కొలంబసు. అమెరికా ఖండమును కనుగొని, స్పెయిను దేశమునకు యూరపు ఖండములో అతడు గొప్ప గౌరవ, ప్రతిష్ఠలు చేకూర్చి పెట్టెను. స్పెయిను దేశపు మహాపురుషులలో అతడొకడు. ప్రపంచ చరిత్రలో ఘనకార్యములను సాధించిన మహావ్యక్తులలో క్రిస్టొఫర్ కొలంబసు ఒకడుగా పరిగణింప బడుచున్నాడు.
డి. రా.
కొలంబియా :
కొలంబియా ఒక ప్రజాస్వామిక రాజ్యము (Republic). ఇది దక్షిణ అమెరికాలో వాయవ్యభాగమున నున్నది. దీనికి ఉత్తరమున కరిబ్బియన్ సముద్రము, తూర్పున బ్రెజిల్, వెనిజులా దేశములు, దక్షిణమున ఈక్వెడార్, పెరూదేశములు, పశ్చిమమున పనామా, పసిఫిక్ మహాసముద్రములు ఎల్లలుగా నున్నవి. ఉత్తర దక్షిణములుగా దీని పొడవు 1050 మైళ్ళు. తూర్పు పడమరలుగా దీని వెడల్పు 860 మైళ్ళు. 4,39,829 చ. మై. దీని విస్తీర్ణము. ఇందు 1,21,08,000 మంది జనులు కలరు. (1953 జనాభా లెక్కలు) బొగోటా దీనికి ముఖ్యపట్టణము. ఇందు 6,45,000 మంది జనులు నివసించు చున్నారు.
కొలంబియా యొక్క పశ్చిమ, మధ్యమ భాగములందు వ్యాపించిన పర్వతశ్రేణియొక్క నైసర్గిక లక్షణములు
87