Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కొరియాదేశము (చరిత్ర)

కొరియారాజు తన అధికారమును మరల స్థాపించుకొని, జపాను అధికారులను బర్తరఫ్‌చేసి, వారి స్థానమున రష్యా అధికారులను, రష్యా సైనిక అధ్యాపకులను నియమించెను.

జపాను సామ్రాజ్యములో కొరియా విలీనము : కొరియాలో తమ ప్రయోజనములను రక్షించుకొనుటకై జపాను రష్యా ప్రభుత్వములు కొరియాతో సమాధాన పడుటకు యత్నించెను. ఇరుదేశములును కొరియా స్వాతంత్ర్యమును గుర్తించుటకును, ప్రత్యక్షముగకొరియా ఆంతరంగిక వ్యవహారములలో జోక్యము కలిగించుకొన కుండుటకును అంగీకరించినవి. కాని ఈ అంగీకారము నిరర్థకమయ్యెను. రెండు దేశములును ఒండొంటిపై క్రీ. శ. 1904 వ సంవత్సరములో యుద్ధము ప్రకటించుకొనెను. జపాను కొరియాపై బడెను. తత్‌క్షణమే కొరియా ప్రభువు జపానుతో సంధి జేసికొనవలసివచ్చెను. ఈ సంధి ప్రకారము కొరియా స్వాతంత్ర్యము మరల గుర్తింపబడెను. కాని రష్యాపై యుద్ధ మాచరించుటకు అవసరమైన సైనిక కేంద్రములను కొరియాలో నిర్మించుకొనుటకు జపాను హక్కును సంపాదించెను. యుద్ధము విరమించక పూర్వమే, ఆర్థిక, సైనిక, వై దేశిక, న్యాయశాఖల నిర్వహణమునకై తమ సలహాదారులను అంగీకరించునటుల జపాను ప్రభుత్వము కొరియాను కోరి కృతకృత్యతనొందెను. అంతటితో ఆగక, కొరియాలోని తంతి, తపాలా, టెలిఫోను శాఖలనుగూడ జపాను స్వాధీనమొనర్చుకొనెను. అంత, రష్యా కిక్కురు మనకుండ, కొరియాలో జపాను చలాయించదలచిన సర్వాధికారమును గుర్తించెను. ఆ విధముననే అమెరికా, బ్రిటిష్ ప్రభుత్వములు గూడ అనుసరించెను. క్రీ. శ. 1905 వ సం॥ నవంబరులో కొరియాపై తన రక్షణాధికారమును (Protectorate) జపాను లాంఛనప్రాయముగ స్థాపించుకొనెను. ఈ రక్షణాధికారము 5 సంవత్సరములు కొనసాగెను. అనంతరము జపాను కొరియా సైన్యమును విచ్ఛిన్నముచేసి, ఆ దేశమును తన సామ్రాజ్యములో 1910 వ సం॥లో కలుపుకొనెను.

కొరియాను పాలించుటకై జపాను తన రాజప్రతినిధిని నియమించెను. ఇతడు జపాను ప్రభుత్వమునకే బాధ్యుడై యుండెను. ఇతని క్రింద వ్యవహరించు సలహా వర్గముగూడ జపాను నెడల భక్తి ప్రపత్తులతో మెలగవలెను. ఉన్నత పదవులన్నియు జపానీయులే ఆక్రమించుకొని యుండిరి. చిల్లర ఉద్యోగములలో మాత్రమే కొరియనులు నియమింపబడిరి. ఈ విధముగ జపాను ప్రభుత్వము కొరియాను పశుబలముచే నిరంకుశముగ పాలించెను.

జాతీయ చైతన్యము : తన పాలనములో జపాను ఎడతెగక కొరియనుల ప్రతిఘటనమును ఎదుర్కొనవలసి వచ్చెను. ఈ ప్రతిఘటనమును జపాను తన సైనిక బలముచే తెగటార్చి, వేలకొలది కొరియనులను హతమొనర్చెను. ప్రథమప్రపంచ సంగ్రామా (1914 - 18) నంతరము వలసరాజ్య ప్రజలలో ఉవ్వెత్తుగా విజృంభించిన జాతీయ విప్లవ చైతన్యముచే, కొరియనులు ప్రభావితులైరి. దేశభక్తిపరాయణులైన లక్షలాది కొరియనులు బ్రహ్మాండమైన ప్రదర్శనములు జరిపిరి. వేలాది కొరియను ప్రదర్శకులు జపాను తుపాకులకు గురియై ప్రాణములర్పించిరి, ఈ సంఘటనమునకు జపాను ప్రభుత్వము కలవరపడి కొరియనులకు వాక్స్వాతంత్ర్యము, అధికారవికేంద్రీకరణము మున్నగు సంస్కరణములను ప్రవేశపెట్టుటకు అంగీకరించెను. కాని వీటిలో కొన్నిటిని మాత్రమే అమలు జరిపెను. ఈలోగా కొరియాలోగల పెక్కు రాజకీయ పక్షములవారు ఐక్యమై క్రీ. శ. 1919 సం॥లో ఒక రహస్య ప్రదేశమున సమావేశమై చర్చలు జరిపిన పిమ్మట తాత్కాలిక ప్రజాప్రభుత్వ స్థాపనమును గూర్చి ప్రకటన చేసిరి. అప్పుడే పారిస్ లో సమావేశమైన శాంతిమహాసభ చేతను, వాషింగ్టన్‌లో సమావేశమైన, ఆయుధవిసర్జన మహాసభ చేతను, నానాజాతి సమితిచేతను, తమ తాత్కాలిక ప్రభుత్వమును గుర్తింపజేయ యత్నించిరి. కాని జపాను తన పలుకుబడిని ఉపయోగించిన కారణముగా ఈ ప్రయత్నములు విఫలములైనవి. అయినను, కొరియా జాతీయ వాదులు తమ పోరాటమును రెండవ ప్రపంచ సంగ్రామమువరకు కొనసాగించుచునే యుండిరి. పెక్కురు జాతీయవాదులు అమెరికా, చైనా, మంచూరియా, సైబీరియా ప్రాంతములకు పలాయనమై అచ్చటినుండి గూడ తమ పోరాటమును సాగించిరి.

79