Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు

రామాయణము నందలి పర్ణశాల యనునది ఎచ్చట నున్నది? అను విషయములో మహారాష్ట్ర పత్రికలలో వాదోపవాదములు చెలరేగెను. మహారాష్ట్రములోని నాసికాత్ర్యంబకమే పర్ణ శాలయని మహారాష్ట్రుల వాదము. ఈ వాదమునందు బాలగంగాధర తిలకు మొదలగు పండిత ప్రకాండులను ఢీకొన్న సాహసికుడు లక్ష్మణరాయడు. భద్రాచలమునొద్ద నున్న పర్ణశాలయే రామాయణము నందు వర్ణితమైన పర్ణశాల యని తర్కబద్ధముగ, సోదా హరణముగ నిరూపించి మహారాష్ట్రవిద్వాంసులనుదిగ్భ్రమ గొల్పిన ప్రతిభాశాలి లక్ష్మణరాయడు. మహారాష్ట్రభాష యందు ఈయన చేసిన సాహిత్య వ్యవసాయము అపారమని తెలియుచున్నది. ఇప్పటికిని లక్ష్మణరాయని ప్రేమ గౌరవములతో మహారాష్ట్ర విద్వాంసులు స్మరించు చుందురు. ఈనాటికి కూడ మహారాష్ట్రవాఙ్మయ సంస్కృతిలో లక్ష్మణరావుగారికి అత్యున్నతస్థాన మున్నది.

లక్ష్మణరాయడు మహారాష్ట్రమం దున్నంతకాలము మాతృభాష యగు ఆంధ్రభాషను విస్మరించెనని తలచ కూడదు. వీరును, వీరి అక్కగారగు భండారు అచ్చమాంబగారును ఆంధ్రభారతిని తమ ఇంట నెలకొల్పి ఆరాధించుచునే యుండిరి. వీ రిద్దరకు గల ఆంధ్రభాషాభిమానము ఆ కాలములో పెక్కుమందికి మృగ్యమై యుండెను. పరభాషా ప్రాంతములలో నుండిన నేమి? మాతృభాష యెడ ఎట్టి అపచారమును లక్ష్మణరావుగారును, అచ్చమాంబయు సహించెడివారు కారు. కావున వీ రిద్దరును ఆంధ్రభాషలో విశేష విజ్ఞానమును గడింప సాగిరి. ఆంధ్రదేశములోని ఆంధ్ర పత్రికలకు లక్ష్మణరావుగారును, అచ్చమాంబగారును వ్యాసములు వ్రాయు చుండువారు. శ్రీ రాయసం వేంకటశివుడుగారు ప్రచురించు చుండిన "జనానా పత్రిక"కు "విశ్వముయొక్క విరాట్ స్వరూపము", "విశ్వముయొక్క బాల స్వరూపము" - ఇత్యాది ఘన విషయములను గూర్చి లక్ష్మణరావుగారు వ్యాసములు వ్రాసి యున్నారు.

చిత్రము - 16

అంతియేగాదు. లక్ష్మణరావుగారును, అచ్చమాంబయు ఆంధ్రభాషలో ప్రప్రథమమున గ్రంథ రచనకు కూడ కడగిరి. అచ్చమాంబగారు "అబలా సచ్చరిత్రమాల" అను ఉద్గ్రంథమును రచించిరి. లక్ష్మణరావుగారు "శివాజీ చరిత్ర" మను గ్రంథరాజమును రచించిరి. శివాజీ చరిత్రగ్రంథపీఠికలో మొదటి నాలుగు పంక్తులలో శ్రీ పంతులుగారు తమ అభీష్టమును ఇట్లు సూచించి యున్నారు:

"ఆంధ్రభాషయందు చరిత్ర గ్రంథంబు లత్యల్పముగా నున్నవి. కాన చేతనైనంతవరకు మాతృభాషా సేవ చేయవలయు నని యిచ్ఛతో నీ చరిత్రగ్రంథంబు వ్రాసినాడ. శక్తివంచనలేక యికముందును నిటులనే భాషాసేవ చేయవలయునని యిచ్ఛ గలవాడను" అని వ్రాయుటయేగాక పీఠికాంతమున "ఇట్లు ఆంధ్రభాషా సేవకుడు, గ్రంథకర్త" అని సంతకము చేసి యున్నారు. ఈ ఆదర్శమును అక్షరాలా క్రియాపూర్వకముగ నెరవేర్చి జీవితపు తుది నిమిషము వరకును ఆచరణములో పెట్టిన ధన్యజీవి లక్ష్మణరావు గారు. అయితే ఈ సత్సంకల్పము లక్ష్మణరావుగారికి నాగపూరులో విద్యార్థిగా బి. ఏ. పరీక్షకో, ఎం. ఏ. పరీక్షకో చదువుకొనుచున్న రోజులలోనే ఏర్పడినది. అప్పటికే అధికారవాంఛ, ఐహిక భోగములు ఆదర్శములుగా పెట్టుకొని ఆకాశ హర్మ్యములను మానస

67