విజ్ఞానకోశము - 3
కొప్పులింగేశ్వర క్షేత్రము
పళ్లెరమునం దుంచెను.ఆ వెనుక పరమేశ్వరుని మ్రోల నిలచి నమస్కా రాది విధులు నెరపి, దోసిలి యొగ్గి, నిలచి యున్న రాజు శిరముపై పూజరి పరమేశ్వరుని పాదుకలుంచి, చేతిలో వేశ్య జడ ముడి నుండి తాను కొని తెచ్చిన దండను శివనిర్మాల్య ప్రసాదముగా నుంచెను.
తాత్కాలికముగ దొరికిపోకుండు ఉపాయమునకు వేశ్యజడనుండి దండ తీసికొని వచ్చెనేగాని, దానిలో లోపమేదైనా కలదేమో యని పూజరి చూడలేదు. ఆ మాలికలో వేశ్య జడలోని వెండ్రుక యొకటి చుట్టుకొని యుండుట అతడు గమనించ లేదు.
పూజరి రాజు చేతిలో పెట్టిన పూలదండను పురజనులు శ్రద్ధగా పరికించి, అందొక తలవెండ్రుక యుండుట చూచి, ప్రభువుతో "అయ్యా ! ఇది శివనిర్మాల్యమైన మాలిక కాదు. ఈ దండ ఈతని ప్రేయసియైన వేశ్య జడలోనిది. కాకున్న ఈ మాలికలో తల వెండ్రుక ఏల యుండును?" అని తెలిపిరి. ప్రభువును, పురజను లెరిగించిన వార్త సత్యమే యని నిశ్చయించుకొని, “ఏమయ్యా పూజరీ! నీవు వేశ్యాలోలుడవై యుండుటయే గాక, మా యెడలగూడ ఇట్టి యపచారము చేయ సాహసించితివే ! ఇట్టి నిన్నేమి చేయవలయును?" అని యాగ్రహముతో పలికెను. పూజరి బెదరక, తాను చేసిన తప్పును సవరించుకొనుటకై, “ప్రభూ! ఈ దండ వేశ్యజడలోనిది కాదు. ఈశ్వర నిర్మాల్యమగుటలో సందియము లేదు. దీనిలో తల వెండ్రుక ఏల వచ్చెనందురా ? మా స్వామికి శిరమున కొప్పు కలదు. ఈ మాలికను శివజటాజూటమునం దలంకరింపగా, అందలి వెండ్రుక యొకటి దీని కంటినది” అని నిబ్బరముగ బదులు చెప్పెను. పరిసరమందున్న పురజను లందరు పూజరి పలుకులు అసత్యములని యొక్క పెట్టున ఘోషించిరి. పూజరి తన మాటలు ముమ్మాటికి నిక్కములే యని వక్కాణించెను. అట్లయినచో ఈశ్వర లింగమునకు కొప్పు చూపింపగలవా యని ప్రభువడుగగా, పూజరి తప్పక అట్లే చూపింపగల ననెను. అప్పుడే నాగాభరణము తీసి లింగముపై కొప్పు చూపింపు మని రా జడుగగా, పూజరి "ప్రభూ! ఈనాడు మా స్వామికి మాధ్యాహ్నిక “పూజాదికము నిర్వర్తించి, నాగాభరణ భూషితుని గావించి, పుష్పాదికముచే అలంకరించి యుంటిని. రేపటి ఉదయమున గాని మరల ఈ నాగాభరణమును తొలగింప వలను పడదు. తమరు చూడ దలతు రేని, రేపటి ఉదయమున కొప్పు కాన్పింప జేసెద" అనెను. ప్రభువు అందులకు అంగీకరించి ఆరాత్రి అచటనే నిలచి పోయెను.
పూజరి తన తలమీదికి వచ్చిన ఆపదను తప్పించుకొనుటకై లింగమునకు కొప్పు కలదని అప్పటికి తప్పించుకొనినాడే కాని, శిలారూపమైన లింగమునకు జడముడి యుండు టెట్లు ? పూజరి వేశ్యాలోలు డయినను అఖండ శివభక్తుడు. తన భక్తిచే ఏ పనినైనను సాధింపగలనను ధైర్యము గలవాడు. ఆత డా రాత్రివేళ గుడితలుపులు బిగించి, ఆగస్త్యేశ్వరుని మ్రోల నిలచి, భ క్తితో స్వామిని ప్రార్థించి తానుచేసిన యపరాధమును అతనికి విన్నవించి, “స్వామీ ! నా యపరాధమును సైచి నీవు కొప్పు రప్పించుకొని నా మానము కాపాడకుండిన, నీ యెదుటనే ప్రాణములు వదిలెదను" అని హఠము పూని యుండెను. అట్లుండగ వేగునంతకు ఆ లింగమున కొప్పు మొలతేరెను. మరునా డుదయమున ప్రభువు పౌరులతో గూడి పరమేశ్వరుని కనుగొన వచ్చునప్పటికి అగస్త్యేశ్వర లింగమున జడముడి కానవచ్చినది. ఆ వెండ్రుకలనుగూడ పూజరి లింగమునకెట్లో అతికించెనను సంశయమున ప్రభువు చేసాచి పెరికి చూడగా, రోమ కూపముల నుండి నెత్తురు చిందెను. దానితో రాజు కన్నులు మసక గొనెను. ప్రభువుగూడ ఈశ్వర భక్తుడగుటచే, తన యపరాధమును క్షమింపు మని ప్రార్థింపగా, అతని దృష్టి మరల తిన్న బడెనట. ఇది అగస్త్యేశ్వరుడు కొప్పు లింగేశ్వరుడగుటను గూర్చిన ఐతిహ్యము.
పూజరి వేశ్యాలోలుడయ్యును తనభక్త్యతిశయముచే లింగమునకు కొప్పు కాన్పింప చేసినందుకు ప్రభు వెంతయు సంతసించి, పలివెలపురమునకు పశ్చిమమున ఒక యామడదూరములో వసిష్ఠా నదీ తీరమున ముప్పది పుట్ల భూమిని సర్వకర పరిహరముగ అతనికి మాన్యముగా నిచ్చెను. ఆ భూమికి 'జుత్తిగపాడు' అను పేరు నాడును, నేడును గూడ నిలచియున్నది. నిన్న మొన్నటి వరకు ఆ భూమిపై సర్వాధికారములు ఆ పూజరి వంశము వారికే చెందియుండెను. ఇది చారిత్రక సత్యమని ఈ
65