కొండాపురం
సంగ్రహ ఆంధ్ర
ఇటిక 22 అంగుళముల పొడవు, 12 అంగుళముల వెడల్పు రెండున్నర అంగుళముల మందము కలదిగా నుండెను. గోడల మూలలందు 20 అంగుళముల చదరపు ఇటికలను వాడిరి. గుండ్రని కట్టడములకు—స్తూపములు, గోపురములు మున్నగు వాటికి-వంపు మూలలు గల ఇటికలను వాడుచుండిరి. ఈ యిటికలు 2000 సంవత్సరములు గతించి నప్పటికిని ఇంకను చెక్కు చెదరక అందముగా నున్నవి. ఇండ్లపై పెంకులు కప్పుచుండిరి. నేలగచ్చు చేయుచుండిరి.
ఇచ్చట మూడు విహారములు, రెండు చైత్యములు, 3 స్తూపములు కనబడినవి. ఒక విహారములో 7 గదులు కలవు. 4-5 గదుల మధ్య 5 అడుగుల 2 అంగుళముల వెడల్పు గల నడవ కలదు. ప్రతి గదియు 10 చదరపు టడుగుల విస్తీర్ణము కలదిగా నున్నది. బౌద్ధభిక్షువుల నివాసము కొరకు మూలలయందు కట్టబడిన కొట్టిడీలు కలవు. ఒక చైత్యముయొక్క లోపలి భాగము 25 అడుగుల 4 అంగుళముల పొడవు, 10 అడుగుల 4 అంగుళముల వెడల్పు కలిగి యున్నది. ఒక స్తూపముయొక్క ఆవర్తపు అడ్డు కొలత 19 అడుగు లున్నది. ఇచ్చట బుద్ధదేవుని ప్రతిమ దొరకలేదు. కావున ఇచటి జనులు హీనయాన శాఖకు చెందిన బౌద్ధు లయి యుందురని తేలుచున్నది.
ప్రతి గృహమునందును ఒకటి, రెండు నేలమాళిగలు కనబడినవి. ఈ నేలమాళిగలలోనే వివిధ నాణెములు, అచ్చు దిమ్మెలు, విగ్రహములు, అమూల్యాభరణములు, పూసల పేర్లు మొదలగునవి దొరకినవి. వాటిని అమూల్యములుగా భావించి నేలమాళిగలలో భద్రపరచి యుందురు. అసేతు హిమాచల పర్యంతము గల చరిత్ర పరిశోధకులను ఆశ్చర్యచకితులను గావించినది ఇచ్చట గనబడిన కుంభ కార విద్యాప్రావీణ్యము. ఇచ్చటి కుమ్మరి చిత్రకళను, శిల్పకళను మేళవించిన ప్రతిభాశాలి. ఈతడు మట్టితో కుండలనే గాక గాజులను, సొమ్ములను కూడ చేయుచుండెడి వాడు. ఎఱ్ఱమట్టినే వాడుచుండెను. ఒక జాడి అసాధారణమగు పనితనము గలిగి ఎత్తుగా నున్నది. ఒక భాండము తొమ్మి దడుగుల వలయము, మూడడుగుల లోతు కలిగి, వన్నెచిన్నెలతో నిగనిగలాడుచున్నది. మృణ్మయ పాత్రములు వివిధ వర్ణములతో చిత్రాలంకార భూషితము లయి నాజూకుగా నున్నవి. పూజకు ఉపయోగించు భాండములపై సాంకేతిక చిహ్నములు కలవు. ఒక దానిమీద "బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి" అను త్రిరత్నములు చిత్రింపబడినవి.
ఈ కుమ్మరవాడు బోలు విగ్రహములను తెల్లని, మెత్తని మట్టితో చేసి త్రివర్ణములతో చిత్రించినాడు. ఆ విగ్రహముల తలలపై శిరో వేష్టనములు గలవు. ఆ విగ్రహముల పాగాలు, వాటి మెడలోని హారములు, వాటి చెవులకు గల పోగులు, ఆకర్షకములుగా నున్నవి. కొన్ని నవ్వుపుట్టించు విగ్రహములు కలవు. ఈ కుమ్మరి హాస్యప్రియుడుగా కనబడుచున్నాడు.
ఇచ్చటి కమ్మరీడును గట్టివాడే. కొడవళ్ళు, గొడ్డళ్ళు, పటకాలు, బాకులు, ఉలులు, మేకులు, నాగళ్ళు మొదలగునవి దొరికినవి. బల్లెముల అగ్రములు దొరకుటచే ఇచ్చట సైన్య ముండెనని తోచుచున్నది. కొలుములు, తిత్తులు, కాల్చిన పనిముట్లను చల్లార్చుటకు పెద్ద పెద్ద నీటి బానలు, కమ్మరి అంగళ్ళు ఎక్కువ సంఖ్యలో కనబడినందున కమ్మరి పని ఇచ్చట భారీయెత్తున సాగుచుండెనని మనము గ్రహింప వచ్చును.
ఇచ్చట రత్నాల సొమ్ములు, బంగారు సొమ్ములు దొరకినవి. వాటిని భాగ్యవంతులు పెట్టుకొనుచుండి రనవచ్చును. వెండి, రాగి, దంతపు సొమ్ములు, ఆల్చిప్ప సొమ్ములు కూడ దొరకినవి. వీటిని బీదవారు ధరించుచుండి రనవచ్చును. రత్నాభరణములు వివిధాకారములలో నున్నవి. నిరుపేదల కొరకు కుమ్మరివాడు మట్టిగాజులు, మట్టి హారములు, మట్టి తాయెతులు చేయుచుండెను. భాగ్యవంతులు బంగారు కాసుల దండలు వేసికొను చుండగా బీద పడుచులు కుమ్మరివాడు సృష్టించిన మట్టికాసుల దండలను వేసికొని కులుకుచుండిరి కాబోలు, ఈ మట్టి కాసులు క్రీస్తుశకములోని రోమక బంగారు నాణెములను అచ్చముగ పోలి యున్నవి.
ఇచ్చట సుమారు నాలుగువేల నాణెములు దొరకినవి. ఇందు 10 వెండివి, 100 పంచలోహములవి, 50 రాగివి, మిగత నాణెములు సీసపువి. ప్రతి నాణెమునకు చిల్లి
62