పుట:SamskrutaNayamulu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
94

సంస్కృతన్యాయములు

రథమునకు పూచ్చిన గుఱ్ఱములొకదాని నొకటి కలిపికొనుచు నొకమాటగ నడచినఁగాని రథము సరిగ నడువదు. ఆలుమగ లన్యోన్యము పొరసులు లేక అనుకూలముగా నుండిన కాఁపురము రాణించును; లేనిచో జీర్ణించును.

రథ్యాదీపన్యాయము

త్రోవలో దీపము పట్టుకొని నడచునపుడు దీపపు వెలుతురు దీపమున్న చోటికంటె ముందు పడును. తరువాత నచటికి దీపము వచ్చును. అపుడును దీపపువెలుతురు ఆచోటికన్న ముందే యుండును.

రథ్యాప్రవాహన్యాయము

వీథులలోనుండి వచ్చు పిల్లకాలువ లొకటై యేఱుగా పాఱునట్లు. (లోష్టప్రస్తరన్యాయమును జూడుము.)

రశ్మితృణాదిన్యాయము

సూర్మరశ్మి గడ్డిపొరలపైఁ బడి రంగురంగులుగ చూడముచ్చటగఁ గాన్పించును. సూర్యకాంతమణిపైఁ బడి భగ్గున మండి చుట్టునున్న తృణాదులను తగులబెట్టించును. ఒకనికి ఒకనిమీఁద అనుగ్రహము, ఒకనిమీఁద ఆగ్రహము ఉండుట లోకస్వభావము.

రాజపుత్రవ్యాధన్యాయము

రాజపుత్రుఁడు వ్యాధుఁ డైనట్లు.