పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కరటకుని వీడుకొని పింగళకునియొద్దకు బోయి వందన మాచరించి దమనకు డిట్లనెను.

దమనకుడు పింగళకుని మనసు విఱుచుట

"ప్రభూ! 'ఆపద గలిగినపుడును జెడుత్రోవ బట్టినపుడు, గార్యసమయము దాటిపోవునపుడును మేలుకోరు మంత్రి రా జడుగకున్నను హితము జెప్పవలయు' నని పెద్ద లందురు. రా జుపభోగమునకు దగినవాడు. కర్తవ్య మేమఱక మంత్రి కనిపెట్టుచుండవలయును. అట్లు చేయని మంత్రి ద్రోహియగును. సమయము వచ్చినపుడు స్వామి కార్య ముపేక్షించుటకంటె మరణము మేలు."

ఇట్లు పలుకుచుండ బింగళకుడు "దమనకా! నీకు సందియము వలదు. చెప్ప దలచినది నిశ్శంకముగా జెప్పుము. నీమనసునకు బాధ కలిగించిన విషయ మెయ్యది?" యని యడుగ దమనకు డిట్లనెను.

"దేవా! మీవిషయమై సంజీవకుని నడవడి యేమియు జక్కగాలేదు. తొలుత నాత డిట్టివాడని యెంత మాత్రము గనిపెట్టలేక పోయితిమి. అచట నచట మీమీద నేరము లెన్నుచు మీసామర్థ్యముం దూలనాడుచున్నాడు. ఆతని వైఖరిం జూచినచో గ్రమక్రమముగా గొలది కాలములో నీరాజ్యమే వశపరచుకొన నూహించు విధము గోచరించున్నది.