పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుందే లిట్లు సింహమును గొంతదూరము తీసికొని పోయి యచటనున్న యొక లోతైన పాడునూయి చూపి "స్వామీ! యిందున్నది; చూడు" మనెను. ఆసింహము బుద్ధిహీనతచే నూతియందు దన ప్రతిబింబము జూచి వేఱొక సింహ మనిభ్రమించి కోప మాపుకొన జాలక గట్టిగా గర్జించుచు నందుఱికి ప్రాణములు గోలుపోయెను.

కుందే లొనరించిన సాహసము విని యాయడవి యందలి జంతువులన్నియు దానిని మిక్కిలి మెచ్చుకొనెను."

ఈమాటలు విని "యిప్పుడేమి యుపాయ మాలోచించితివి?" అని భార్య యడుగగా వాయస మిటులనెను.

ఇచటికి సమీపమున నున్న సరోవరమునందు రాజ పుత్రుడు ప్రతిదినము వచ్చి జలక్రీడ సేయుచున్నాడు. స్నాన సమయమం దాతడు మణులు పొదిగిన తన చేతియుంగరముం దీసి గట్టుపై నిడును. అపుడు దానిని ముక్కున గఱచికొని వచ్చి యీచెట్టు తొఱ్ఱయం దుంచెదను." అనిపలికి యొక నా డావాయస మట్లే చేసెను.

రాజభటులు లాయుధములు చేతబట్టుకొని యుంగరము వెదకుచు నాచెట్టును సమీపించి తొఱ్ఱలో నుంగరముం జూచి యచట 'బుస్సు బుస్సు' మనుచున్న కృష్ణసర్పముం జంపి యాయుంగరము గొనిపోయిరి. కాబట్టి యుపాయముచేతనే పింగళక సంజీవకులకు విరోధము గలిగింపవచ్చును" అని పలికి