పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈసంగతి కొంతకాలమునుండి వినుచుండియు నేసంగతి యైనను స్పష్టముగా గమనింపకయే వ్యవహరింపరాదని యూరకుంటిని, కాని యింక నూరకున్నయెడల గార్యము మించిపోవున ట్లుండుటచేత జెప్పక తప్పినదిగాదు. మంత్రులందఱిం బరిత్యజించి సర్వాధికారము లీతని కిచ్చుటవలన నీ యపాయము గలిగినది.

రాజ్యలక్ష్మి, సమర్థుడైన మంత్రియం దొకపాదమును, రాజునం దొకపాదమును మోపి నిలిచియుండి స్త్రీసహజమైన చాపల్యముచేత నొకరిని విడిచి మఱియొకరిం జేరుచుండును. ఒక్కనికే రాజు సర్వాధికారము లొసగినచో నాతడు గర్వించి స్వతంత్రింప నెంచును. స్వాతంత్ర్యమం దిచ్ఛగలిగిన మంత్రి రాజునకు బ్రాణాపాయము గలిగింప సాహసించుటలో వింత యేమి యున్నది?

విషము గలిసిన యన్నమును, గదలిన పంటిని, దుష్టుడగు మంత్రిని సంపూర్ణముగా విసర్జించుటే యుత్తమము. ఎవడు రాజ్యలక్ష్మిని సచివాయత్త నొనరించునో వాడు మంత్రి దుష్టుడైనపుడు గతిలేక దు:ఖ మనుభవించును. సంపద గోరని వాడును లోకమున నుండడు." అని దమనకుడు చెప్పిన మాటలన్నియు విని కొంచె మాలోచించి పింగళకు డిట్లనెను.

"ఓయీ! దమనకా! శరీరము సకలరోగములకు దావలమైనను దాని నెవ్వరును విడిచిపెట్టుటకు సిద్ధపడరు,