పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలిసికొని విచారించెను. కావున నేపనియు దూరమాలోచింపక చేయరాదు."

హిరణ్యకు డీవిధముగా నెంతచెప్పినను వినక భయము చేత మంథరుడు మఱియొక చోటునకు బోవుటకే నిశ్చయించి పయనమాయెను. స్నేహవశమున హానిని శంకించుచు హిరణ్యకాదులును వెంట నేగుచుండిరి. అట్లు నేలమీద ప్రయాణము సేయుచుండగా నొకవేటకాడు చూచి మంథరుని బట్టుకొని వింటికొనకు గట్టివైచి తిరిగి తిరిగి యాకలి గొని యింటికి మరలిపోవుచుండెను. వెంటనున్న మృగవాయస మూషికము లీసంగతి చూచి మిక్కిలి విషాదమొంది వేటగాని ననుసరించి పోవుచుండెను. అట్లు పోవుచు హిరణ్యకు డిట్లు చింతించెను.

"ఒక దు:ఖము ముగియులోపలనే మఱియొక దు:ఖము సంప్రాప్తమయ్యెను. సందు దొరకినపుడే యనర్థములన్నియు నొకదానివెంట నొకటి వచ్చి మీదబడును. ఆపద గలిగినపుడు ప్రాణములు సయితము లెక్కసేయక కాపాడు సన్మిత్రుడు మహాభాగ్యమువలన గాని లభింపడు. శోకము నుండియు, శత్రువుల నుండియు గాపాడునట్టియు; బ్రీతి విశ్వాసములకు బాత్రుడు నగు "మిత్రుడు" అను నక్షరత్రయముతోడి రత్న మెవరివలన సృష్టింపబడెనో కదా! సన్మిత్రుని యందుండు నమ్మకము తల్లియందును, దండ్రియందును, భార్య