పుట:SamardaRamadasu.djvu/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడు మానవజాతిలో నధము డగును. కార్యమునందు గట్టిపూనిక గలవానికి నేకార్యము నసాధ్యమై యుండదు. మనుష్యు లెంత సమర్థులైనను, నెంత తెలివిగల వారైనను వారిని దూరముగ నుంచి వారిపని యవసర మైనప్పుడే వారిం జేర బిలువవలెను. చూడగనే యే మనుష్యుని యందును విశ్వాస ముంచవద్దు. నీవు నీ విశ్వాసములోనికి దీసికొనక ముందు ప్రతిమనుష్యుని కఠినపరీక్ష చేయవలెను, మీద దైవ మున్నాడు, అతనిదయవలన మంత్రశక్తి బలవత్తర మగును. పూర్వము గొప్పవారైన వారందఱు నిరంతరము పాటుపడుటవల్లనే ఘనులైరి. నీ మనస్సును వశపఱచుకొనుము. ఇతరుల మనస్సులను బరిశోధింపుము. వారు తొండవలె రంగులు మార్చుకొనకుండ జూడుము. రాజకార్యవిషయములలో నితరులు గమనించునట్లు గమనింపుము. వారు పోయిన పోకడలు పొమ్ము, సంజ్ఞలవలన జేయదగిన పనిని నోటితో బలికి చెప్పకుము. మాటలాడదగిన విషయము లిఖితపూర్వకముగ జేయకుము. ఆలోచించి చేయదగిన విషయములను తొందరపడి నోటితో జెప్పకుము.

4. మహారాజా ఛత్రపతి శంభాజీకి రామదాసుడు వ్రాసిన లేఖ.

శంభాజీ మహారాష్ట్రప్రభు వైన శివాజీ కుమారుడు, పితురనంతరము నితడే సింహాసన మెక్కెను. కాని యితడు శివాజీవంటివాడు గాడు. దుర్వ్యసనాసక్తుడై తాను పాడై రాజ్యమును బాడుచేసెను.

నీ వెప్పుడును శ్రద్ధగ నుండుము. విషాదమునకు నీ హృదయమున స్థాన మీయకుము. ముఖ్యవిషయములను నీ వేకాంతముగ గూర్చుండి శోధించుచుండుము. భయంకరమైన క్రూరమైన నీ ప్రస్తుతస్వభావమును విడిచిపెట్టుము. శాంతము వహింపుము. విదేశీయుల కుట్రలనుండి నీ దేశమును దప్పించుటకు నీ హృదయమును సిద్ధముగ నుంచుము. పూర్వపు మంత్రుల నందఱను క్షమించి వారల మరల రప్పించుము. వారల హృదయములను సంతుష్టిపఱచి వారిపూర్వపు టుద్యోగముల వారి కిమ్ము.