Jump to content

పుట:SamardaRamadasu.djvu/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా వాక్యములు మీలో గొందఱ కాగ్రహము దెప్పించవచ్చును; గాని క్షమింపుడు. భగవంతునికి ద్రోహులైనవారు. కుక్కలుగాని మనుష్యులు కారు. ఆట్టివారిని తన్నివేయుడు. ధర్మమతు లైన దేవభక్తులే విజయము గాంతురు. మతసంస్థాపనకొఱకు దేవునిపాదములను మీశిరస్సులమీద ధరించి మీయుత్సాహపూరితము లైన పనులతో దేశ మంతయు బ్రతిధ్యనించునట్లు చేయుడు. చుఱుకుగ నుండుడు. మంచి యాలోచన గలిగియుండుడు. ఏ ప్రయత్నమును జేయ మానకుడు. జగన్మాత యైన "తుల్యభవాని" వరముచేతనే శ్రీరాముడు రావణుని సంహరించె నన్నమాట మనసులో నుంచుకొనుడు. ఓ మిత్రులారా! ఈ తుల్యభవాని శ్రీరామునికి వరములిచ్చి ప్రసిద్ధికెక్కినది. అందుచేతనే రామదాసు డని ప్రసిద్ధిజెందిన నే నామెను గొలుచుచుందును.

3. శ్రద్ధ.

ఈప్రసంగము రామదాసుడు శివాజీకి భగవత్ పతాక నిచ్చినప్పుడు చేయబడెను.

ఎవరిని నమ్మవద్దు. నీ పన్నాగములు నీవే స్వయముగ నాలోచించుకొని పన్నుకొనవలెను. నీ ప్రయత్నము లన్నిటిలోను నిశ్శంక మైన ధైర్యము వహింపుము. శరీరబాధలు వచ్చినప్పు డధైర్యము బూనకుము. సమస్తచికిత్సలు చేయింపుము. అంతట నీకు దప్పక సుఖము కలుగును. కఠినసమస్యలను నీ వేకాంతముగ గూర్చుండి యాలోచించి సాధింపుము. నీ జ్ఞాపకశక్తిని జక్కగ నిలుపుకొనుము. శత్రువులను మిత్రులను కఠిన శోధనల జేయుము. ఏప్రయత్నమును మానకుము. భోగములపొంత బోకుము. నేర్పుగల యుపాయములు పన్నునట్లు వ్యవహరింపుము. నాయకుడు శౌర్యమునందు వెనుకబడగూడదు. తన కార్యములలో ముఖ్యసూత్రములవిషయమై యశ్రద్ధ చేయగూడదు. అత డెప్పుడు సోమరియై యుండగూడదు. అట్లుండిన బశుప్రాయ డగును. ఎవడు తన ధర్మమువిషయమై ప్రాలుమాలి యుండునో, యాలోచించుట మానునో,