పుట:SamardaRamadasu.djvu/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. యుద్ధవీరుల ధర్మము.

రాజుధర్మమునుగుఱించి సంగ్రహముగ మాటలాడితిని. ఇప్పుడు క్షత్రియధర్మమునుగుఱించి ప్రసంగించెదను. ఆ ధర్మము నెఱవేర్చుట మిక్కిలి కష్టము. ప్రాణభయము గలవారు యుద్ధవీరులవృత్తిలో బ్రవేశించగూడదు. వారు మఱియొక వృత్తివలన జీవయాత్ర గడుపవలెను. రణరంగమునుండి వెన్నిచ్చి పరుగెత్తినవాడు నరకదు:ఖము ననుభవించును. యుద్ధములో మగతనము జూపక యింటికి బారిపోయినవాడు బహుపాపములు చేసినవాడగును. యుద్ధములో జచ్చిపోయిన వానికి వీరస్వర్గము సిద్ధముగ నుండును. నీవు జయించి గృహమునకు బోయితివేని యింటిలోగూడ నీకు మహానందము గల్గును. పురుషుడు విశేష శౌర్యము మహోత్సాహము గలిగియున్న పక్షమున, దేశకాలపరిస్థితుల నెఱింగిన పక్షమునను విజయము స్వయముగ వచ్చి వానిపాదములపై బడును. తాను చేయదలచిన కార్యముయొక్క స్వభావమును, బ్రాముఖ్యమును గ్రహింపని నిర్భాగ్యుడు రణరంగమున నేమి చేయగలడు. జనులను సంతోషపఱచినప్పుడే యుద్ధమును చేయవచ్చును. గెలువవచ్చును ఇప్పుడు చూడుదు! పుణ్యక్షేత్రము లన్నియు మైలపఱుపబడినవి. ప్రతిస్థలములోను మత మగౌరవింపబడి యణగ ద్రొక్కబడుచున్నది. ఇటువంటి దురవస్థ చూచుచు బ్రతికి యుండుటకన్న మీరందఱు చచ్చిపోవుట మేలు. కావున "నేను మహారాష్ట్రుడను" అని చెప్పుకొను ప్రతిమానవుడు పదిమందితో గలిసి నడుముగట్టి సేనలో జేరి నడువవలయును. మన మహారాష్ట్ర ధర్మమును తిరిగి వ్యాపింపజేయుటకు సకల ప్రయత్నములు చేయవలెను. ఈవిషయమున నే మాత్రము సందేహము మీకు గలిగినను మీపితృపితామహ ప్రపితా మహాదుల శాసనములు మీతలపై బడును. మీరు మరణము తప్పించుకొనలేరు. కావున మంచి యాలోచనతో శక్యమయినంత పని మీరేల చేయరాదు? మేము గొప్పవారము ముఖ్యులము అనుకొనువారందఱు నొక్క జెండాక్రింద జేరవలెను. అట్లు వారు చేరనిపక్షమున వారు తమ తప్పునకు ముందుముందు పశ్చాత్తాపము నొందుదురు. తన జాతిని తన ధర్మమును వదలినవాడు గొప్పవాడ నని యెట్లనుకొనగలడు?