పుట:SamardaRamadasu.djvu/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవాహమున కడ్డగట్టు గట్టినయెడల నీరు ప్రవహింపదు. జనసామాన్యముల మనస్సులు నిర్భంధము లేకుండ స్వేచ్ఛ గనున్నప్పుడే ఘనకార్యములు సాధింపబడును. జనసంఘములు, పలుతావులయందు నిరోధింపబడినప్పు డపాయము సన్నితమై యుండును. నీ పెద్దలు సంపాదించిన ప్రశాంతి చెడగొట్టి వివాదములు కలహములు పెంచుట వినాశ కారణ మగును. నీ శత్రువు లా సందు గనిపెట్టి నిన్ను చెఱుపజూతురు; కావున దానిని దప్పించుకొనుము. రెండు కుక్క లొకయెముకకొఱకు బోరాడినయెడల మూడవకుక్క దాని నెత్తుకొనిపోవు నను లోకోక్తి నీవు వినలేదా ఇది? చక్కగ విచారించి, నడుముగట్టి చేయవలసిన మహాకార్యములను జేయుము. ధైర్యహీనత నాశనమునకు దారితీయును. సకలజనుల మన:క్షేత్రములందు శాంతిబీజములను జల్లుము. జను లందఱిని జేరదీసి, వా రేక కార్యముఖులై యుండునట్లు చేసి వారిచేత శత్రువులను బాఱదోలింపుము. ఇందువలన నీ కీర్తి ప్రపంచమం దన్ని దిక్కులయందు వ్యాపించును. ప్రపంచ మంతయు నీ కత్తికి జడిసి, నీ పేరు చెప్పిన భయమున గడగడ వడంకి లోబడును. నీ విట్లు చేయని పక్షమున రాజ్య మెప్పుడో యొకప్పుడు కూలిపోవును. దేశకాలపరిస్థితులను గమనించి, క్రోధమునకు తావొసంగకుము. క్రోధ మణచుకోలేనిపక్షమున శాంతికవచనమునైన దొడుగుకొని, నీలో కోప మున్నట్లు ప్రజలకు దెలియనీయకుము. ప్రజలు తమ హృదయములలో నిన్ను గుఱించి భయపడగూడదు. లెక్కలేని సైన్యమును బోగుచేసి వారిచేత మ్లేచ్ఛులను బాఱదోలింపుము. ప్రస్తుత మున్న దానిని రక్షించి నూతనరాజ్య మార్జించి దానికిం గలిపి మహారాష్ట్రప్రభ దేదీప్యమానమై శాశ్వతముగ వెలుగునట్లు చేయుము. అనంతమైన యుత్సాహశక్తిని గలిగియుండును. నీ శౌర్యముకొలది నీ ఖడ్గమును బ్రయోగింపుము. నీ వొక మహారాజువై మహోన్నతదశను బొందుదువు. నీవు శివాజీమాట జ్ఞాపక ముంచుకొని యీ ప్రపంచమునను బరలోకమునను నీ కీర్తి శాశ్వతముగ నుండునట్లు ప్రయత్నింపుము. నీ ప్రాణములను తృణప్రాయముగ నెంచుము. శివాజీ యొక్క యెడతెగని యుత్సాహమును, నసమాన ఘనతను జ్ఞాపక ముంచుకొనుము. అవియే యతనిని మృతజీవుని జేసినవి.