పుట:SamardaRamadasu.djvu/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిలువబడి సుల్తానుకు సలాము చేయవలెను. ఎన్నిబుద్ధులు చెప్పినను, ఎన్ని సంజ్ఞలు చేసినను దండ్రిచెప్పినట్లు చేయక శివాజీ నిర్భయముగ నిలువబడి తలవంచుకొనక కన్నులు తెఱచి సుల్తాను వంక చూచెను. దుర్వినయము గల యట్టి కొడుకువల్ల దనకెట్టి కీడు మూడునో యని షాజీ భయపడెను. దర్బారు ముగిసెను. శివాజీ సెలవుగైకొనకయే చివాలున కొలువునుండి లేచిపోయెను. కొడుకును మందలింపవలె నని షాజీ కూడ గొలువు విడచి యావలకు బోయెను. కాని యింతలో శివాజీ ఘోరకృత్యమొకటి చూచెను. రాచబాటకు బ్రక్కనే యొక కటికవాడు, గోవు నొకదానిని జంప సమకట్టి దానిని తెగవేయుటకు కత్తినెత్తెను. ఆ ఘోరకృత్యమును జూచి శివాజీ సహింపలేక కటిక వాని చేయి యెత్తిన దెత్తినట్లుండగానే శివాజీ యాహస్తమును దన ఖడ్గముతో నఱికి వేసెను. షాజీ యా వార్త సుల్తాను విన్నచో నేమి ప్రమాదము వాటిల్లునో యని శంకించి వెంటనే బాలుని పునహాకు పంపించివేసెను. పోవునప్పుడు బాలుడు తండ్రిపై గోపించి పట్టపగలు నడివీథిలో గోహత్యలు జరుగుచుండగా వారింపని ప్రభుత్వముకడ నేల యుద్యోగము చేయుచున్నా వని తండ్రిని మందలించెను. శివాజీ సాహస మట్టిది. అతడుపాధ్యాయుని శిక్షనుగాని తండ్రిశిక్షనుగాని బొందువాడుగాడు. శివాజీకి బదియాఱు సంవత్సరములు వచ్చునప్పటికి సాహసకృత్యములయందు నభిలాష గలిగి తనవలెనే సాహసికుల కొందఱు యువకుల జేర్చుకొని యాయుధముల ధరించి కొన్ని యూళ్ళపై దండు వెడలి కొన్ని చిన్న కోటలను బట్టుకొన నారంభించెను. క్రమక్రమముగ నతడు పెద్దవాడై పెద్దకోటలు పట్టుకొన నారంభించెను. బీజపూరు సుల్తాను వాని దుండగములు విని వాని సాహసము మాన్పించుటకై ఒక రిద్దరు సేనాపతులను బంపెను. కాని వారిని శివాజీ మాయోపాయము చేత గెలిచెను. వారిలో ముఖ్యుడు ఆఫ్‌జుల్‌ఖాన్ అను సేనాపతి. ఇతడు మిక్కిలి బలవంతుడు. శివాజీ సబబుగ వానిని రావించి తా నొక యినుప కవచము తొడుగుకొని కవచము చాటున నొక చిన్న యాయుధమును మఱగు పఱచి మహమ్మదీయ సేనాపతిని గౌగిలించుకొన్నట్లు నటించి తన చిన్న యాయుధముతో నతని గుండెలలో బొడిచి చంపెను. దానితో