Jump to content

పుట:SamardaRamadasu.djvu/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నంటి తఱుమ జొచ్చెను. అట్టి పరిస్థితులలో షాజీ తన భార్యను షివనీర్ కోటలో నుంచెను. శివాజీతల్లియగు జిజియాబాయి మిగుల నాత్మగౌరవము గల స్త్రీ. గర్భభారముచేత గ్రుంగియున్న యామె మృదుమానసముమీద నీ దురవస్థయెంతో పనిచేసెను. అధికారములో నున్నవారు తన భర్తకు జేయుచున్న గౌరవము, పంపుచున్న బహుమానములు మొదలైన వన్నియు నీటి బుగ్గలవలె నస్థిరము లనియు హిందువులలో బ్రధాన పురుషులకు బరస్పర వైషమ్యములు కల్పించి స్వాధీనము చేసికొని యేలుటయే వారి యభిప్రాయమనియు నూహించెను. షాజీ మహారాష్ట్రమున మిక్కిలి పలుకుబడి గల పురుషుడు. బీజపూరు సుల్తానులను సింహాసన మెక్కించుట దింపించుట మొదలగు పనులలో నతడు మిక్కిలి గట్టివాడు. బీజపూరే గాక యహమద్ నగరు సుల్తానులు గూడ యాతని చేతిలోని కీలుబొమ్మలే. అతడెట్లాడించిన వా రట్లాడుచుండిరి. అతడు గొప్ప రాజ్యవ్యవహారవేత్త యని పేరు గలదు. అతడు పూనా జాగీరుదారు డయ్యెను. ఆమె యెక్కడనో యొకమూల నొకకోటలో బడియుండుట యెంతమాత్ర మిష్టము లేదు. మగపిల్లవాడు పుట్టినను, ఆడపిల్ల బుట్టినను స్వతంత్ర భావములతో నా బిడ్డను బెంచవలెనని యామె సంకల్పించెను. తరువాత స్వల్పకాలమునకే 1627 వ సంవత్సరమున ఏప్రియల్ 10 వ తేదీని నామె గర్భమున శివాజీ కుమారుడు జన్మించెను. ఆమె గర్భవతి యైనది మొదలు పలు కష్టములు పడెను.

శివాజీ బాల్యకాలమున విద్యాభ్యాసము చేయునప్పుడు రామాయణ వీరులు భారతవీరులు మొదలగు మహాపురుషుల యద్భుత సాహసములు విని మెచ్చి తాను గూడ నట్టిచర్యలు చేయవలెనని యాశపడు చుండెడివాడు. ఒకసారి బీజపూరు సుల్తాను షహజీని బిలిచి యతని కుమారుని శివాజీని చూడ వలెనని కోరెను. అప్పటికి శివాజీ కెనిమిది సంవత్సరములు వయస్సు. షాజీ యందుకు సమ్మతించి సుల్తానువద్ద మిక్కిలి వినయ విధేయతలు గలిగి దర్బారు మర్యాదల ననుసరించి నడుచు కొనవలెనని బుద్ధులుచెప్పి కొడుకును దీసికొని పోయెను. ఆ నాడు సుల్తాను గొప్ప దర్బారు చేసెను. దర్బారులో బ్రతి మనుష్యుడు వంగి మోకాళ్ళమీద