పుట:SamardaRamadasu.djvu/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భరించుటే గాక లోకమునకు గూడ గొంత సేవ చేయవలెను. మఠాధిపతియైన మహంతు లోకారాధనమే చేయవలెను. అతని హృదయము స్వార్థపరత్వమునకు జోటీయ గూడదు. అట్లెడ మిచ్చినవాడు మహంతు శబ్దమునకు దగడు. స్వార్థపరు లెన్నడును, దమకును నితరులకును గూడ మేలు చేయ జాలరు. జనరంజకముగ బనిచేయ దలచిన వాడు జనరంజకముగ మాటలాడవలెను. జన వశీకరణ శక్తి జిహ్వకే కలదు. ఇతరుల సౌఖ్యమే తన సౌఖ్యముగాను, ఇతరుల బాధలే తన బాధలుగాను బోధకుడు భావింపవలెను. సత్యము నతిక్రమింపని స్వాదు సంభాషణ వలన నితరులు వశంవదు లగుదురుగాని కఠినోక్తుల వలన లొంగరు. పిచ్చివానిని పిచ్చివా డన గూడదు. ఏ రహస్యము బయలు పెట్టరాదు. సానుభూతియు, శాంతియు, తప్పును క్షమించు స్వభావమును ప్రాముఖ్యములు, కోపము మిత్రులను శత్రువుల జేయును. మధుర సంభాషణము శత్రువులను మిత్రులుగ జేయును. కొంటెవాండ్రు గాని దుర్జనులు గాని తమ వాదముల ఖండించి యెదురు తిరిగి కార్యవిఘ్నము చేయదలచినప్పుడు వారిని జయించుటకు శాంతవచన ప్రయోగములే మహాయుధములని యతడు బోధించెను. వేయేల; బోధకుడు పరిపూర్ణుడుగ నుండవలె నని రామదాసుని యభిప్రాయము. అన్ని విద్యలలో గొంచెము కొంచెము వ్రేలుపెట్టక యేదో విద్యలో పరిపూర్ణడై యుండుట మంచిదని రామదాసుని యభిప్రాయము. ఈ పై బోధలను జూడ రామదాసు డెంత ప్రజ్ఞావంతుడో, యెంత కార్యసాధకుడో సులభముగ దెలిసికొన వచ్చును.


_______