పుట:SamardaRamadasu.djvu/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మఠములు స్థాపించి లెక్కలేనంతమంది శిష్యుల నేర్పఱచి వారిని సంచార కార్యమున సంచరించు చుండవలెనని యాజ్ఞాపించుటచేత నతడెంత దూరముగ నాలోచింప గలవాడో తెలుసుకొన వచ్చును. మతబోధకు డెట్లు జనుల హృదయముల నాకర్షింపవలెనో వారి నెట్లు రంజింపచేయవలెనో యా విషయమై యత డిచ్చిన యుపదేశములు శ్లాఘాపాత్రములు. ప్రతి గ్రామము పోకముందు బోధకుడు గ్రామముయొక్క పరిస్థితులు చక్కగా విచారించి ప్రవేశింపవలెను. ఈ విచారణమువలన గ్రామవాసులలో నెవ్వరు సాధుజనులో, ఎవ్వరు ధర్మపరాయణులో, ఎవ్వరు వట్టి ప్రేలరులో, ఎవ్వరు వట్టి స్తోత్రపాఠకులో, ఎవ్వరు స్వార్థపరులో తెలిసికొని తన వల పన్ని పనిచేయుటకు నవకాశము కలుగును. ఆ బోధకుడు దుర్జనులను, ద్రోహులను బహిరంగముగ ఖండించి దూషించ గూడదు. దుర్జనులను కనుగొన వలసినదేగాని వారిని దూషించి వారితో విరోధము దెచ్చుకొన గూడదు. తక్కిన జనులకంటె వారిని మిక్కిలిగా భూషింపవలెను. ఈ విధముగ నేర్పఱుప బడిన మతబోధకులు మహారాష్ట్ర దేశమున గల నగరములలోను, బట్టణములలోను, బల్లెలలోను సంచారముచేసిరి. మానవుల సమస్త విషయములలోను రామదాసీ శిష్యవర్గము వలన సకల జ్ఞానమును సంపాదించెను. నీవు భిక్షుకుడవుగ సంచరించినప్పుడు "గొప్ప గ్రామమైనను కుగ్రామమైనను బేదయూరైనను, సంపదగల గ్రామమైనను, వెళ్లి గుడిసె గుడిసెకు దిరిగి సమాచారము సంగ్రహించుకొని రమ్మని యత డాజ్ఞాపించెను. అటువంటి భిక్షకుడు స్వార్థపరుడని యెవడన గలడు. ధనముగాని వస్త్రములుగాని గ్రహింపక వారు బిచ్చ మెత్తినపుడు గుప్పెడు ధాన్యము తప్ప మరి యే వస్తువు పుచ్చుకొన కూడదని యతడు కఠినముగ శాసించెను. బోధకుడు సంతుష్టి గలిగి యుండవలయును గాని యాశాపాతకుడు కాగూడదు.

మనప్రాణము లితర ప్రాణములతో గలుపవలెను. మన యాత్మ యితరుల యాత్మలతో మైత్రిచెందవలెను. ఆహా! యిది యెంత యమూల్యమైన యుపదేశము. ఆ యుపదేశము ననుసరించినవారు మహారాష్ట్ర జాతికి నిర్మాతలైరనుట ఆశ్చర్యముగాదు. దేశముద్ధరింప దలచినవారు