పుట:SamardaRamadasu.djvu/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృత్తి వలన స్వార్థత్యాగులైన యువకులు పొట్టకై ననవసరములైన వ్యవహారములలో దిగకుండ తన కృత్యము తాను నిర్విఘ్నముగ జేసికొనుట కవకాశము గలిగెను. పూర్వకాలమున భిక్ష మెత్తు సన్యాసులు లోకానుగ్రహార్థమై పాటుపడెడి వారని వారిని జనులు గౌరవించెడివారు. భిక్షాటనము నేటికాలమున సోమరిపోతులకు శ్రమలేనిదియు, లేశము పెట్టుబడి లేనిదియునైన యొక వ్యాపారమైనది. ఇది దేశముయొక్క దురదృష్టము. పనిచేయగలవాండ్రు పనిచేయక సంసారయాత్ర నేదోవిధముగ గడుపుకొను లోకులను బీడించుట శోచనీయము. రామదాసుడీ భిక్షావృత్తిని గుఱించి దాసబోధ యను గ్రంథములో సకల సందేహములు నివేదించెను. తన మహారాష్ట్ర ధర్మము నవలంబించిన ప్రతి బ్రాహ్మణునకు బ్రతి మానవునకు విద్యుక్తధర్మమని విధించెను. బ్రాహ్మణు డనగా బ్రాహ్మణ జన్మము నెత్తినవాడు కాదు. బ్రహ్మజ్ఞానము కలవాడు మాత్రమే బ్రాహ్మణుడు. దేశ సేవా పరాయణుడే బ్రాహ్మణుడు. ఈ యభిప్రాయము మనసులో బెట్టుకొనియే రామదాసుడు బ్రాహ్మణులనే గాక యర్హులని తోచిన వారిని నాలుగువర్ణములనుండి శిష్యులుగ గ్రహించెను. అందు బురుషులేగాక స్త్రీలుగూడ నుండిరి. పవిత్రవర్తనము వైరాగ్యభావము గల వారిని మాత్రమే యతడు చేరదీసెను. రామదాసుడు శిష్యులే విధముగ ధర్మముల నవలంబించవలె నని విధించెనో విచారింతము. ఇందుకై యత డెన్నో మఠముల స్థాపించెను. ప్రతి మఠమునకు నొక్క శిష్యుని, మఠాధిపతిగా నియమించెను. ప్రతి మఠాధిపతియు దన మండలములో మిక్కిలి శ్రద్ధతో జనులకు బోధింపవలెను. ఈ యుద్యమమునకై యా బోధకు డేదో యొక గ్రామమున పెక్కునాళ్లుండక బోధించుచు నొక పల్లెనుండి మరియొకపల్లెకు సంచారము చేయుచుండవలెను. రామదాసుడు తాను తీర్థ యాత్రలు చేసిన పండ్రెండు సంవత్సరములలోను జ్ఞానసంపాదన చేసినట్లే బోధకులు గూడ సంచార సమయమున బహు విషయపరిజ్ఞాన మార్జింపవలెనని యతని కోరిక. కాని యతడు మఠమును విడిచి సంచరించరాదు. తన మఠ మే మండలములో నున్నదో యా మండలములో మాత్రమే యతడు సంచరింపవలెను. ఈ విధముగ రామదాసుడు లెక్కలేనన్ని