తొమ్మిదవ ప్రకరణము
బోధకులు - బోధకధర్మములు
ఒకజాతి పదభ్రష్ట మైనప్పుడు జనులు దేశలాభము చూడక స్వలాభపరాయణులై ధర్మ హీనులై వర్తింతురు. దేశమట్లు పాడైనప్పుడు దైవానుగ్రహముచేత నెవరో కొందరు స్వార్థత్యాగులు బయలుదేరి దేశసముద్ధరణమునకై పాటుపడుదురు. అట్టి స్వార్థత్యాగులు మానవ సేవ జేసి లోకముద్ధరించుటకై ప్రయత్నముజేసి తమ ప్రాణములనైన ధారవోయుదురు. స్వదేశమును నెండియు నుద్ధరించుటకు రామదాసుడు స్వార్థవిహీనులైన యువకు లనేకుల జేరదీసి వారిని శిష్యులుగా స్వీకరించెను. పడుచువాండ్రు లోకసేవ జేయుటకై ముఖ్యమైన యాటంక మొకటి గలదు. ప్రతి మనుష్యుడు తనపొట్ట బోసికొనుచు యాలుబిడ్డల బోషించుకొనవలసిన భారమొకటి యున్నది గదా? మానవు డూరకుండినను బొట్ట యూరకుండదు. ఆకలిచే భాధ పడుచున్న వాడును కుటుంబ సంరక్షణ చేసికొనలేనివాడును లోకమున కేమిమేలు చేయగలడు? సర్వధర్మములను బరిత్యజించి తన్నొక్కనినే నమ్మిన వానిని సకల కష్టములనుండియు సకల పాపముల నుండియు విముక్తుని జేయుదు నని శ్రీకృష్ణ భగవానుడు గీతలో జెప్పియున్నాడు గదా! గొప్ప మనోదార్డ్యము గల మహాత్ములు దప్ప సామాన్య జను లా వాక్యము ననుసరించి నడువలేరు గదా! శిష్యులకు నిత్యభుక్తి గడచుటకు రామదాసుడు మతబోధకు లందఱు బిక్షావృత్తిచేత జీవింపవలె నని శాసించెను. ఈ యుపాయముచేత మతబోధకు లొకరి యండ నుండకుండ యొకరికి విధేయులై యుండకుండ యథేచ్ఛముగా సర్వతంత్ర స్వతంత్రులై వ్యవహరించుటకు వీలుకలిగెను. ఈ భిక్షావృత్తి మతబోధకుల యాకలి దీర్చుటకు మాత్రమే యుద్దేశింపబడెను. గాని వారు దాని నొక జీవనాధారముగ జేకొని ధన కనక వస్తు వాహనములు సంపాదించుకొనుటకు గాదు. ఈ