ఈ పుట ఆమోదించబడ్డది
విరక్తులై యుండవలెనని యాతని శాసనము. విరక్తు లనగా సన్యాసులు కావలెనని యాతని యభిప్రాయము కాదు. మనుష్యులు గృహస్థులై సంసారముచేయుచు కేవలము లోకవ్యవహార నిమగ్నులుగాక యీశ్వరభక్తి గలిగి ధర్మమార్గమున సంచరించు చుండవలె నని యతని బోధన సారము. ప్రతి మనుష్యుడు ధర్మమును దాను ముం దాచరించి చూపి పిదప జనులకు బోధింపవలసినదని యాతని యుత్తరవు. ఆచరణతో గూడని మాటలు వట్టి బూటకములు. వట్టిమాటల పోగులు కుక్క మొఱగుల వంటివి. ధర్మాచరణము చేసిన వారు బోధించినప్పుడే ప్రజలా ధర్మము నాచరింతురు గాని వట్టి మాటలచే గాదు.
- _______