పుట:SamardaRamadasu.djvu/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపాసకుడు మొట్ట మొదట కర్మము చేయవలెను. పిదప నుపాసన చేయవలెను. అటుపిమ్మట నతనికి జ్ఞానము గలుగును. జ్ఞానము వలన ముక్తి సంప్రాప్తించును. ఇది రామదాసుని బోధామృతసారము.

ఈ వరుస ననుసరించి నడువవలయునని మహారాష్ట్రుల కెల్ల రామదాసు డాదేశ మిచ్చెను. శ్రీరామునిపై నిశ్చలముగ మనసు నిలిపి ధ్యానింపదలచు వారు తమకు ఏయే కర్మలు విధింప బడినవో యా కర్మలు తప్పక చేయవలెను. అప్పు డతడు సద్గురుని యాశీర్వచనములు బడయుట కర్హుడగును. అంతట గార్యక్రమమును బట్టి జ్ఞానము పిత్రార్జితమువలె నతని కప్రయత్నముగ సంక్రమించును. అట్లు కృషి చేసిన యతడు తప్పక ముక్తిని బడయగలడు. ఇదియే "మనాచీ" శ్లోకములలో నున్న సారము. మహారాష్ట్ర వేదాంత గ్రంథములలో నేదియు రచనావిధానమునకు విషయబోధమునను, హేతుకల్పనమునను, విశేషించి గొప్ప యర్థమును జిన్న మాటలతో నిముడ్చునట్టి శక్తిలోను, "మనాచీ" శ్లోక గ్రంథమును బోలదని చెప్పుట యతిశయోక్తి గాదు. అందుచేతనే తత్కాలపుభక్తులు, పండితులు నైకకంఠ్యముగా నేతద్గ్రంథము వేదములకు దాళముచెవి యనియు, శాస్త్రముల సారమనియు వచించిరి. ఆ గ్రంథ మంతయు నీక్రింది ముఖ్యభాగములుగా విభజింప బడవచ్చును.

1. ఉపాసన యొక్క ప్రాశస్త్యము, వెల.
2. రామనామస్మరణ యొక్క ప్రాధాన్యము.
3. సాధు సజ్జన సాంగత్యము యొక్క యావశ్యకత.
4. మనో వాక్కాయ కర్మముల యేకీభావము.
5. ఇంద్రియ నిగ్రహముయొక్క యవసరము.
6. పరోపకారమునకై యుద్యమించుట.
7. పనికి మాలిన చర్యలు, సోమరితనములు పరిత్యజించుట.
8. వివేకము యొక్క ప్రాశస్త్యము.
9. సద్గురు సేవ.