పుట:SamardaRamadasu.djvu/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

"మొదట జేయుము. తరువాత జేయింపుము." ఇదే రామదాసు విజయమునకు నుత్తమ కీలకము. ఇందుచేతనే దేశస్థు లందఱు నతడు చూపిన మార్గము నందు మాఱు మాటాడక నడచిరి.

ఏ కార్యముం జేయని వట్టి ప్రేలరిమూకను రామదాసుడు పనికిమాలిన దుర్జను లని నిర్భయముగా బలుకుచుండును. తమ రెన్నో ధర్మోపదేశములు పరులకు జేయుచు దాము స్వయముగా నాచరింపజాలని శూరమ్మన్యుల నెందఱనో మనము గూడ జూచుచుందుము. మాటలు కోటలు దాటునట్లు చప్పువా రనేకు లుందురు. కాని కార్యరంగమున దిగి ఫల మపేక్షింపక ధర్మకార్యములం జేసి కృతకృత్యులగువార లరుదు. ఆచరణము లేక వట్టి మాటలు చెప్పు బోధకులు చాలమంది యుండవచ్చును. కాని వారిగంభీరోపన్యాసములు గౌరవముతో వినువారు తక్కువగా నుందురు. తన శిష్యులు భిక్షములకు బోయినప్పుడు, వల్లించు కొనుటకై "మానాచీ శ్లోకములు" ముఖ్యముగ రామదాసుడు రచియించెను. పరమార్థమునకు రాచబాటను లోకులకు జూపుటకును స్వమతములో నున్న ప్రాశస్త్యమును మధురములై సహేతుకములైన వాక్యములతో నరటి పండొలిచి చేతికిచ్చి తెలుపుటకును "మానాచీ" శ్లోకములు రామదాసునిచే నుద్దేశింపబడినవి. గ్రంథకర్త సంకల్పము సంపూర్ణముగ నెరవేరెను. హృదయోత్సాహకరములైన యాశ్లోకములు జనులయొక్క శ్రద్ధ నాకర్షించి తమతమ కృత్యముల యందు వారు స్థిరముగ నిలుచు నట్లు చేసి విద్యుచ్చక్తి వలె వారి తత్త్వముల మార్చెను. పరమార్థమునకు దాను జూపిన రాచ బాట తప్ప మరియొక రాజవీధి లేదనియు, సనాతన మహర్షులు మున్నగు వారా పుంతనే నడచి ముక్తులైరనియు, మతావేశము గలిగించు నీశ్లోకములనే హిందువు లందఱు వల్లించి సారము గ్రహించి తత్ప్రకారము నడుచుకొనవలయు ననియు రామదాసుడు దేశమంతకును సందేశము నంపెను. అవి జనుల యుద్దేశములకు సరిపోయినందున వారందఱు నిద్రలోనుండి మేలుకొని నట్లొక్క మాఱు తెలివి తెచ్చుకొని పరమప్రీతితో నా శ్లోకముల జదువుకొనిరి.