Jump to content

పుట:SamardaRamadasu.djvu/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరక్తుడు ప్రతిస్థలమునందు నుపాసనలు జరుగునట్లు చేయింపవలెను. కాని యతడు స్వయముగా నెచ్చట నుండడు. అతడు తెరచాటున నుండవలెను. అట్లుండిన ప్రజల దురభిప్రాయము లనెడు బాణముల కతడు గుఱిగాక యుండును.

దీనింబట్టి రామదాసుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టి ఫలాపేక్ష లేని నిష్కామకర్మమం దభిలాషగలవాడని నిశ్చయింపవచ్చును. "నేను ప్రపంచమునం దున్నాను. కాని, నాకు బ్రపంచసంబంధము లేదు." యని యా మహాయోగి యను చుండును.

ఈ కాలముననే రామదాసుడు మనాచీ శ్లోకములు రచియించెను. మనాచీశ్లోకము లనగా మానసబోధశ్లోకములు. ఈ పద్యకావ్యమునందు 205 చిన్న శ్లోకము లున్నవి. శ్లోకమునకు నాలుగేసి చరణములు గలవు. ఇందు గుప్తవేదాంతమున్నది. అదిగాక మనుష్యులు ప్రతిదినము చేయవలసిన పవిత్రజీవనమును గుఱించి కొన్ని సూచనలును గలవు. మరియు శ్రీరామునిపై దృడతరముగా మనస్సును నిలిపి భజింపవలయుననిగూడ నాగ్రంథములో నున్నది.

నిజ మారయ జనసామాన్యమునకు ధర్మోపదేశము జేయుట కా కాలమున రామదాసు డొక్కడే నిజమైన సమర్థుడు. అట్లయిన నతడు తన మనస్సున కేల బోధించుకొనవలయును? మనాచీ శ్లోకములలో దన మనస్సునకు దానే బోధించుకొని నట్లున్నది. అందుచేత నీ సందేహము గలుగుచున్నది. తా నాచరింపకుండ ధర్మమునైన నితరులకు బోధించుట యప్రశస్తము. కావున దన మనస్సునకు ముందుగా దానే బోధించుకొన్నట్లతడు చెప్పినాడు. నిజముగా నతని మనస్సునకు బోధ మవసరములేదు. ఈ విషయమై యత డిట్లు చెప్పెను.

"ఏ పనియైన ముందుగా మన మాచరించి పిమ్మట నితరులచేత నాచరింప జేయవలెను. ఏ పనినైన జేయుటకు మనమే ముందుగా నాలోచించి చేయవలయును. అట్లు చేయు మని పిమ్మట నితరులను బ్రోత్సాహము చేయవలయును."