రామదాసుడు ధర్మసంస్థాపనమునకై పని యీ క్రింది విధముగ నారంభించెను. చాఫల్ గ్రామములో గట్టిన రామదేవాలయములో శ్రీ రామజన్మోత్సములు, మారుతిజన్మోత్సవములు ప్రతి సంవత్సరము జరుప నారంభించెను. ఇవియే గాక నింక ననేకోత్సవములుగూడ నతడు చేయజొచ్చెను. ఈ యుత్సవములు హిందువులలో నదివఱకే యుండినను రామదాసుడు వానికిం గ్రొత్తస్వరూప మిచ్చి దేశస్థులందఱు నచటికి జేరునట్లు చేసెను. ప్రతిసంవత్సరము వేనవేలు జనులక్కడికి జేరుచుండిరి. అట్టి సమయములలో బురాణములు జదివించును. భజనలు జేయించును. కీర్తనలు జరిపించును. ఇంకనెన్నో విచిత్రములైన సేవా విధానములు గలిపించును. అవి అన్నియు మహావైభవముతో జూపఱకు నయనానందకరము గాను, హృదయానందకరముగాను నుండునట్లు చేయించును. మొదటి సంవత్సరము ముగిసినతోడనే యీ యుత్సవముల వార్త మహారాష్ట్ర దేశమం దంతట వ్యాపించెను. అతిదూరము ప్రవహించి వెళ్లినకొలది వెడలుపై పలు పొలములకు నీ రొసంగి సస్యవృద్ధిని చేయునట్టి మహానదివలె మహోత్సాహము పెచ్చుపెరిగి దుర్భరమయ్యెను. అందుచే గొందఱక్కడికి బోవుట మిక్కిలి కష్టముగా భావించి తమ గ్రామములలోను, తమ యిండ్లలోను నట్టి యుత్సవముల జేయనారంభించిరి. ఈ యుత్సవప్రతిష్ఠానములు కారుచిచ్చువలె దేశమంతట వ్యాపించునని రామదాసుడు ముందే యెఱుంగును. వెంటనే యతడు దేశమందు నానాభాగములలో గొన్ని మఠముల స్థాపించి యా చుట్టుప్రక్కల నున్నజను లక్కడ జరుగునట్టి యుత్సవములకు బోవున ట్లేర్పాటులు చేసెను. ఈ విధముగా ననేకోత్సవముల శిష్యులచేత నతడు శ్రద్ధతో జరిపించుచున్నను నతడుమాత్ర మెక్కడ గనబడువాడుగాడు. నూతనములైన యీ మహోత్సవముల నెలకొల్పిన మూలకారణము తానే యని ప్రకటించుకొనుట యతని కిష్టము లేదు. అందుచే నత డా యుత్సవములకు బోక తన గుహలో నేకాంతముగ నుండుచు వచ్చెను. ఈ సందర్భములో నత డిట్లు చెప్పెను.
పుట:SamardaRamadasu.djvu/37
స్వరూపం