పుట:SamardaRamadasu.djvu/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
1. విరక్తుడు ధర్మము నుద్ధరింపవలయును. నీతిని నిర్వహింపవలయును. మిక్కిలి గౌరవముతో దోషులను క్షమియింప వలయును.
2. విరక్తుడు విద్యావ్యాసంగములం దుండవలెను. అత డెప్పుడు బాటుపడుచు, క్షీణించి చెదరిపోయిన పరమార్థమును దన వాక్పటిమచే జనులకు బోధించి పునరుద్ధరింపవలెను.
3. విరక్తుడు ప్రపంచవ్యవహారములలో బ్రవేశింపవచ్చును. కాని వైరాగ్యమును మాత్రము లవమైన విడువగూడదు. దురాశలకు దుస్తంత్రములకు నెఱగాకూడదు.
4. విరక్తుడు దృడమనస్కుడై కష్టముల నోర్చునట్టి ధైర్యముగల వాడై యుండవలెను. ఈ ప్రపంచ మంతయు మాయ యనియు వినశ్వర మనియు భావించి తన సత్ప్రవర్తనముచేతను దన సాహచర్యముచేతను ధర్మము క్రమముగా వికాసము నొందునట్లు చేయవలయును.
5. విరక్తు డొక్క పక్షము మాత్రమే వహింపగూడదు. ఒక్క శాస్త్రము మాత్రమే చదువగూడదు. అన్ని శాస్త్రములు జదివి వానిలో బాండిత్యము సంపాదింపవలెను.
6. విరక్తుడు గొప్ప తపస్సులను జేయవలెను. బహువిధములైన పూజలను నిర్మింపవలెను. భగవంతుని గ్రంథములను బఠించుచు గీర్తనలు భజనలు చేయచుండవలయును. దుర్మార్గులయొక్క నోళ్లు మూతలుపడునట్లు పరిహసించువారు సిగ్గున దలవంచుకొనునట్లు కీర్తనలలోను భజనలలోను నిరుపమానమైన యుత్సాహము కనబరుపవలెను. ఇవి రామదాసుని దాసబోధలో నక్కడక్కడనుండి యెత్తి వ్రాయబడిన విడి వాక్యములు.

తన గ్రంథములో రామదాసు డుపయోగించిన మహారాష్ట్రభాష యతిమనోహరమై లలితమై గంభీరభావ సమన్వితమై యుండును. దాని యర్థగౌరవము మృదుత్వము చెడకుండ భాషాంతరీకరించుట యసాధ్యము. కాని దాని భావము మాత్ర మెట్లో తీసికొని రావచ్చును.