నైనను వదలవలెను. మంచిమంచి దుస్తులు మనుష్యునకు గొప్పతనమును, గౌరవమును దీసికొని రావని రామదాసుని యభిప్రాయము. ఇది నిజమే, ఏ చాకలివానినొ యాశ్రయించి కాసునకైన గతిలేని నిర్భాగ్యుడో, గుణహీను డైన బాలిశుడో, వెలగల దుస్తులు దెచ్చుకొని వానిని ధరించి పురమున సంచరించినంత మాత్రమున వానిని గొప్పవానిగ నెవ్వరు భావింతురు? తెలియని వారొక వేళ నతడు ఘనుడని గౌరవించినను గౌరవము క్షణభంగురమే యగును. మనుష్యున కుండవలసినది విజ్ఞానము. భర్తృహరి తన సుభాషిత రత్నావళిలో జెప్పిన పద్యమిచ్చట ననువదించుట సముచితము.
ఉ. భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగదతారహారముల్
భూషిత కేశపాశమృదుపుష్ప సుగంధజలాభిషేకముల్
భూషలుగావు పూరుషునిభూషితు జేయు పవిత్రవాణి వాక్
భూషణమే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్.
కాలక్రమమున నతనిప్రభావము దేశమందంతట నలము కొనుటచే జనులాసక్తితో నతని దర్శనమెప్పుడగునా, మనమెప్పుడు తగిన సపర్యలుచేసి కృతకృత్యుల మగుదమా యని యతని రాకల కువ్విళ్లూరుచుచుందురు.
రామదాసుడు గొప్ప కర్మవాది. అతనికంటె గర్మవాది యీ నవీన యుగములో లేడు. అతడు స్వార్థము నంతయు బరిత్యజించిన సన్యాసి. విశుద్ధుడైన విరక్తుడు. అతడు కర్మను వదలివేయలేదు. తన శిష్యులను గూడ గర్మను వదలివేయ వలదని యాజ్ఞాపించెను. శ్రీకృష్ణునివలెనే యంతర్జీవితము, బాహ్యజీవితము గూడ కర్మబద్ధమైన దని యతడు వాదించెను. ఈ మహాప్రపంచము యొక్క చక్రములు నిరంతరము కదలుచుండునట్లు మన మెల్లప్పు డేదో పనిచేయుచుండవలయుననియు, నూరకుండిన నా చక్రములు మన మీదుగ బోయి మనల నాశనము చేయుననియు నతడు చెప్పుచుండెడువాడు, కాని యెట్లయిన నేదో కర్మము జరుగుచుండుననియే యాతని యాశయము. తన దాసబోధలో సన్యాసియు, విరక్తుడు చేయవలసిన కృత్యముల నీ క్రింది విధముగ వివరించెను.