Jump to content

పుట:SamardaRamadasu.djvu/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృతార్థులు గావలెనని కోరి జనులు బహువిధ ప్రయత్నములుచేసి, వాని జాడలు తీసి గుంపులు గుంపులుగా నా వివిక్షస్థలమునకు బోయి కన్నులార నతని జూచి చేతులార ననస్కరించి యేదే నుపదేశమును బడసి మఱలిపోవుచుందురు. రామదాసునకు వివిక్షస్థల నివాసము మిక్కిలి ప్రియము. దానిం గూర్చి యత డొకచో నిట్లు చెప్పెను.

సత్యాన్వేషణము తఱచుగా వివిక్త స్థలములలోనే చక్కగా జరుగును. కావున బ్రతిమనుష్యు డెల్లప్పు డట్లు చేయదగును. ఈ వివిక్త నివాస మలవరించుకొన్న యతడు కాలక్రమమున సర్వమనోరథసిద్ధి బొందును.

సివాజీ మహారాజు యొక్క మామ్లతదారుడై యా మండలమును బరిపాలించుచున్న నర్సోమాల్ నాదుడును, చాఫల్ నివాసియు, భాగ్యవంతుడు నైన యానందరావు దేశపాండ్యయును రామదాసుకడకు బోయి తమ శరీరమును, తమ సర్వస్వమును వారికి సమర్పించి, సంసారతరణోపాయ మంత్రముపదేశించి శిష్యులుగా జేకొమ్మని ప్రార్థించిరి. రామదాసుడందు కంగీకరించి వారిని శిష్యులుగా బరిగ్రహించెను. అది మొదలుకొని వారు రామదాసు డెప్పు డే పని చెప్పిన నప్పుడది వారు తప్పక మిక్కిలి వినయముతోడను, భక్తితోడను జేయుచు వచ్చిరి. 1648 సం.రమున రామదాసుడు చాఫలు వద్ద శ్రీరామ దేవాలయ మొకటి నిర్మించి నిరంతరాయముగ నా రామదేవునకు బూజానమస్కారములు నిత్యసేవలు జరుగునట్టు యేర్పాటును జేయమని వారి కానతిచ్చెను.

ఆ యేకాంతస్థలమున నివసించుచున్న కాలముననే తన యుద్యమ రథమును సురక్షితముగా దేశమున నడుపునట్టి యుపాయముల నన్నిటిని జింతించి నిశ్చయించెను. అతడు పట్టణములకుగాని, గ్రామములకుగాని తఱచుగా బోయెడువాడుగాడు. ఒకవేళ బోయిన నిరాడంబర జీవితము గల యా మహాత్ముని జూచి జనులు పిచ్చివా డని భావించుచుండిరి.

ఆతడు కొన్ని మహిమలు చేసినట్లు జనులలో గొప్ప వాడుక పుట్టెను. అతని పిచ్చివాలకము జూచిన వారటువంటి మహామహిమలు