పుట:SamardaRamadasu.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మార్చి, ధర్మసంస్థాపనముచేసి జాతీయ స్వాతంత్ర్యము సమకూర్చవలె నని యతడు సంకల్పించెను.

ఇట్లతడు ప్రయత్నములు చేయుచుండ నతని ప్రభావమునుగూర్చి విని మాహులీనివాసి యగు నారాయణబువాయు, వడగాన్ నివాసి యగు జయరామస్వామియు శ్రమపడి యెట్టెటో యతని జాడలు గనుగొని యతనిని దర్శింపవచ్చిరి. యోగి మహిమ పరమయోగి యెఱుగుననట్లు మహానీయులు మహనీయుల మహిమ లెఱుంగుదురు. రామదాసుడు వారిని సగౌరవముగ నాదరించి వారి స్వస్థానములగు మాహులి, వడగాన్ మొదలగు ప్రదేశములకు దాను నడుమనడుమ నరుగుచుండును. అనంతర మతడు రంగనాథస్వామి, తుకారాంబువాను, చించివాడ నివాసియైన మోర్యాదేవుడు తక్కిన మహారాష్ట్ర భక్తులను గూడ దర్శించెను. వారును మిక్కిలి సంతసించి మరల నతని నివాసమునకు బోవుచుండిరి. ఈ యన్యోన్యదర్శనముల వలన రామదాసు పేరు దేశ మందంతట వ్యాపించెను. మతము నందాసక్తి గల జనులు రామదాసు డెక్కడ నుండునో వాని దర్శన మెట్లుగునో యని విచారింప దొడగిరి. తన కడకు వచ్చిన భక్తులను, యోగులను, మిక్కిలి గౌరవించి, వేదాంత చర్చలు మున్నగునని సమర్థతతో జేయుచుండుటచే వారు తన స్వభావ మెఱిగి యతడు సమర్థు డని చెప్పజొచ్చిరి. పైన నుదహరింపబడిన భక్తులు రామదాసున కంటె ముందుగా దేశములో గొంతపనిచేసిరని యిదివఱకే చెప్పబడినది. ఇప్పుడు వా రందరు రామదాసు యొక్క యుద్యమమును ఘోషించుటకు సాధనములైరి. ఇది క్రీ.శ. 1644 సం.రమున జరిగెను.

ఇది జరిగిన కొలది కాలములోనే రామదాసుడు సతారా మండలములోని చఫాల్ కొండలోయకు బోయి యచ్చట నివాసమేర్పఱుచు కొనెను. ఈక్రొత్తచోటు జరాండా కొండగుహకంటె నిర్జనమై ప్రశాంతమై బాహ్యప్రపంచ సంబంధము లేక యుండేను. ఆతడెంత బాహ్యప్రపంచ సంబంధమును విడిచి రహస్యస్థలములలో దాగినను వానిపేరు లోకమున విశేషముగా మ్రోగుచుండుటచే మహనీయుడైన యాతని దర్శనము చేసి