పుట:SamardaRamadasu.djvu/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డయినను నారీమతల్లియైన తన తల్లిని గాని సోదరునిగాని మఱువలేదు. ఆహా! తల్లి దండ్రులను సోదరులను ఎవడు మఱువగలడు. రామదాసు తన మాతృ దేవతను స్మరియింపని దినమే లేదు. పెండ్లిపందిరిలో నుండి హఠాత్తుగ రామదాసు పాఱిపోయినది మొదలు ప్రేమకు నిలయమైన యా మాతృదేవి యిరువది నాలుగు సంవత్సరముల దీర్ఘకాలము దారుణమైన యా పుత్రువియోగదు:ఖము నెట్లు వహించినో మాటలలో వర్ణించుట మిక్కిలి కష్టము. ముడుతలుపడిన యామె చెక్కులు పుత్రునికై యామె విడిచిన బాష్ప బిందుధారలచే దఱచుగ దడియుచుండెను. నారాయణ నారాయణ యను నామము నిరంతరము నామెనోట నాడుచుండెను. రామదాసుని ప్రఖ్యాతిని వాని తల్లియు సోదరు డయిన శ్రేష్ఠుడును విని యుండిరిగాని తమ నారాయణుడే రామదాసని వా రెఱుగరు. ఎఱిగియున్న యెడల వాని యసమాన కీర్తి వారికి గొంత మనశ్శాంతిని, సంతుష్టిని గలిగించియుండెడిది. నిరంతర పుత్రశోక జ్వరముచేత నెల్లప్పుడు కన్నీరు గార్చినందున "రాణూబాయి" యొక్క దేహారోగ్యము చెడి యెట్టకేలకు నామె కన్నులు పోయెను. ఈ యిరువది నాలుగు సంవత్సరములలోను, రామదాసుని సోదరుడయిన శ్రేష్ఠుడు తగినంత యాత్మజ్ఞానము సంపాదించి వేదాంతియై గొప్ప గృహస్థుడై మాతృవాక్య పరిపాలకుడై భార్యానురాగియై యతిథులకు నభ్యాగతులకు నన్నోదకములిచ్చి వారి నాదరించుచు బేరుప్రతిష్ఠల గాంచుచుండెను. అంతతో బోక ఆతడు "భక్తి రహస్య" మను నొక మహాగ్రంథమును మహారాష్ట్ర భాషలో రచించెను.

ఎట్టకేలకు రామదాసు డిరువది నాలుగు సంవత్సరముల తరువాత జన్మస్థాన మగు జాంబుగ్రామమునకు జేరెను. చేరి మొట్టమొదట మారుతి దేవాలయమునకు బోయి యా దేవుని సేవించి, తనయింటి ముంగిలి వాకిటికిం బోయి, తాను బిచ్చమునకు బోవునపుడు పలికెడి పలుకులే "జయజయ రఘువీరసమర్థ" యని గట్టిగ బలికెను. మన దేశమున బిచ్చగాండ్రు "సీతారామాభ్యాం నమ:" యను నట్లే యా దేశమున యాయ వారమునకు బోవువారు జయజయ రఘువీర సమర్థ యనుట వాడుక,