పుట:SamardaRamadasu.djvu/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పుడు రామదాసుని తల్లి ముందఱి వాకిటలో వసారా మీద గుర్చుండెను. ఎవడో బిచ్చగా డనుకొని బిచ్చము బెట్టు మని తన కోడలిని అనగ శ్రేష్ఠుని భార్యను బిలిచెను. అప్పలుకులు విని రామదాసుడు తల్లి నానవాలు పట్టి మెట్లెక్కి వసారామీదికి బోయి "అమ్మా యీ బిచ్చగాడు సామాన్యముష్టితో దనివి నొందడుసుమీ" యనుచు జడలు గట్టిన తన తల యామె పాదములపై బడవైచి నమస్కరించెను. ఆ స్పర్శవల్లనే యా తల్లి విషయము గ్రహియించి 'నాయనా! నా ప్రియపుత్రుడైన నారోబ మరల వచ్చెనా!' యని గట్టిగ నఱచెను. నారోబ యనగ నారాయణుని ముద్దుపేరు. "తల్లీ యతడే యితడు!" అని రామదాసుడు బదులు చెప్పెను. ఆ మాతాపుత్రసమాగమమందు దల్లికిం గొడుకునకుం గలిగిన పారవశ్యమును ఎవడు వర్ణింప గలడు. ఆమె కన్నులనుండి బాష్పములు దొడదొడ గారెను. శరీరము వడకెను. కంఠధ్వని గద్గద మయ్యెను. ఆమె కుమారుని గట్టిగ గౌగలించుకొనెను. 'నాయన, నారాయణ, నా కన్నులతో నే నిప్పుడు నిన్ను జూడలేను. మందభాగ్యురాలను' "అమ్మా మనము శ్రీరామచంద్రుని భక్తితో గొలుచు చున్నప్పు డా మహాత్ముడు మన కోర్కెలను దీర్పడా," యని పలికి రామదాసుడు తన చేతితో దల్లి కన్నులను నిమిరెను. అంతట శ్రీకృష్ణ వరప్రసాదమున దృతరాష్ట్రునకు దృష్టి వచ్చినట్లు నామెకు నద్భుతముగ దృష్టి వచ్చెను. రాణూబాయి కన్నులు విప్పి బిచ్చపు జోలితో, జడలు గట్టిన తలతో మొగమునుండి వెలువడు బ్రహ్మతేజస్సుతో, దండముతో మాఱిపోయిన రూపుతో దన యెట్టయెదుట నున్న కుమారుని గని తల్లి సంతసించెను. ఆతని యన్నగారైన శ్రేష్ఠుడు లోపల సంధ్యావందనము జేసికొనుచు దమ్ముని కంఠధ్వని విని పఱుగున వచ్చి తమ్ముని జూచి మహానందభరితు డయ్యెను.

రామదాసుడు వచ్చినా డని విని గ్రామవాసు లందఱు గుంపులు గుంపులుగ నచ్చటకు వచ్చిరి. తమ పూర్వ మిత్రుడైన నారాయణుడు రామదాసు డను పేర గొప్ప యోగీశ్వరు డయినందుకు వానిరూపు జూచి యాశ్చర్యము నానందము బొందిరి. చూడగనే వా రప్రయత్న