పుట:SamardaRamadasu.djvu/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నము శివాజీకే దక్కెను. అందుచేతనే దేశస్థు లందఱు శివాజీని మిక్కిలి గౌరవించి పూజించుచున్నారు.

గట్టిస్వతంత్ర సామ్రాజ్యస్థాపనము మత మనియెడు గట్టి పునాదిమీదనే గాని నిలువబడ దని రామదాసు యొక్క నమ్మకము. అందుచేత రామదాసుడు జనులకు దేశాభిమాన మంత్రము, మతాభిమానమంత్రము జోడించి ప్రయోగించెను. ఆ కారణమున జనులకు బరసేవాసన్నిపాత జ్వరము కొంత తగ్గెను. ఈ క్రింది పద్యము రామదాసు యొక్క సంకల్పమును సంగ్రహముగ దెలియ జేయును.

తే.గీ. మొట్టమొదటను శ్రీహరి పూజనంబు
     దేవసేవకు వెన్కను దేశసేవ
     తక్కిన విషయములయందు దగిన శ్రద్ధ
     పూనవలయును మానక మానవుండు.

రామదాసుడు తీర్థయాత్రా సమయమున హిందూదేశమునందు నానాభాగములలో గల యాత్మజ్ఞానులను బ్రహ్మవేత్తలను దేశప్రఖ్యాతి గల సన్యాసులను యోగులను సందర్శించి వారితో వివిధ విషయములను బ్రసంగించి వారికి దన పూనికను దెలియబఱచెను. వారాతని వృత్తాంతమును విని యతని బ్రహ్మచర్య దీక్షకును దైవభక్తికిని దేశాభిమానమునకును, యాతని నీమములకును నివ్వెఱపడి యాసేతుహిమాచల మగు భరతఖండమున నటువంటి యోగి లేడని నొక్కి చెప్పి వానిని దీవించి పంపిరి. రామదాసుడు మహారాష్ట్ర దేశమున స్థిరపడి ధర్మబోధ నారంభించిన తరువాత నాతని పరిచయము గల యోగులు సన్యాసులు పెక్కుండ్రు వచ్చి వానిని సందర్శించి వేదాంతవిషయములను జర్చించి ధన్యులయి పోవుచుండిరి. నారాయణబువా, మాహులి నివాసియైన జయరామస్వామి, ప్రసిద్ధరాజయోగియైన రంగనాథస్వామి, తుకారాము మహారాజ్, చించివాడవాసియైన మొరయదియొ, రఘునాథస్వామి, ఆనందమూర్తి, రామదాసుని తఱచు సందర్శించు వారిలో ముఖ్యులు రామదాసుడు దేశసేవాపరాయణు డయి తద్వృద్ధికై నిరంతరాలోచనా మగ్ను