పుట:SamardaRamadasu.djvu/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిజమయిన దేశాభిమానము కుదురదని రామదాసు యొక్క దృడవిశ్వాసము. రామదాసు బోధించిన ధర్మము పేరు మహారాష్ట్ర ధర్మము. ఇందు రాజకీయధర్మమును మతధర్మమును గూడ నిమిడి యున్నవి. ఈబోధకు రామదాసుడు చిరకాల తపస్సుచేతను, స్వార్థత్యాగముచేతను, దీర్ఘయాత్రచేతను తగినంత యనుభవము గలిగి కావలసిన సాధనసామగ్రి నంతయు జాగ్రత్త పెట్టుకొని పనిచేయుటకు నడుము గట్టికొనెను. వర్ణాశ్రమధర్మ భేధము వృద్ధికి గొంత యాటంకమయినను దానిని నాశనము చేసి సర్వజన సౌభ్రాతృత్వ మను పేర బూర్వపద్ధతులను కలగాపులగము జేయుట కతనికిష్టము లేదు. ఏ యభివృద్ధి కయినను మతమే మూలాధార మని యతడు నమ్మి యున్నందున జనుల హృదయములలో మతాభిమాన మహాగ్నిని బ్రజ్వలింపజేయ సమకట్టెను. నిరాశాతాపముచే వాడిపోయిన జనుల మనస్సుల మీద రామదాసుడు చల్లని ధర్మోదకముల జల్లి చిగురెత్త జేసెను. పనిని నతడు నిరాడంబరముగను, నిశ్శబ్దముగను బ్రారంభించెను.

శివాజీ యంతకుమున్నె స్వరాజ్యసంస్థాపన ప్రారంభించెను. ఆతని సాహసములవల్లను, విజయములవల్లను నతనికి గోబ్రాహ్మణ పరిపాలకుడని పేరు వచ్చెను. సాధుజంతువు లయిన గోవులను మిక్కిలి పవిత్రులయిన బ్రాహ్మణులను రక్షించుటకు శివాజీ కంకణము గట్టికొన్నా డని జనులు చెప్పుకొనుట కారంభించిరి. ఈ విషయములను రామదాసుడు వినకపోలేదు. రామదాసునకు గావలసిన బనులు గూడ నట్టివే. కాని శివాజీ యొక్క సాహసములు మహారాష్ట్ర సామంతులలో గొందఱికి వానియెడ ద్వేషము గలిగించెనే గాని, విశ్వాసము గలిగింపలేదు. శివాజీ కంటె ముందుండిన మహారాష్ట్ర ప్రభువులు స్వతంత్ర మహారాష్ట్రము బ్రతిష్ఠించుటకు బ్రయత్నింపరైరి. ఇట్టి యుదారభావము మొట్టమొదట శివాజీకే కలిగెను. మహారాష్ట్ర సామంతులు మహమ్మదీయ ప్రభువు లను గ్రహించి తమకిచ్చెడు బిరుదములతోను, గౌరవములతోను, జాగీరులతోను, సంతుష్టులై మిన్నకుండిరిగాని, మాతృదాస్య విమోచనమునకునై పాటుపడిన వారొక్కరును లేరు. అట్టి స్వతంత్ర మహారాష్ట్ర సాంరాజ్యసంస్థాపన గౌర