పుట:SamardaRamadasu.djvu/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యచ్చటనుండి లంకకు బోయెను. లంకద్వీపము విడిచి రామదాసుడు పశ్చిమ సముద్రతీరమున బ్రయాణముచేసి త్రోవలో నున్న పుణ్యక్షేత్రముల నన్నింటిని దర్శనము చేసి క్రమముగ మహాబలేశ్వరము చేరెను. ఈ మధ్యకాలమున నక్కడక్కడ మారుతి మఠముల స్థాపించి వానియందు బూజా పురస్కారములు జరుగునట్లు చేసెను. ఇట్లు, పండ్రెండు సంవత్సరము లాసేతుహిమాచల పర్యంతమైన భరతఖండమంతయు యాత్రలు సలిపి సలిపి యెట్టకేలకు నాసిక జేరెను. అక్కడదన ప్రియశిష్యుడైన యుద్ధవుని గలిసికొని యతడు తన కృత్యములను శ్రద్ధాభక్తులతో జేయుచున్నట్లు విని సంతోషించెను. పిమ్మట బవిత్ర మగు గొదావరి జలమున స్నానముచేసి యతడు రామదేవుని యాలయమున కరిగి నమస్కరించి యిట్లనియెను. "భగవంతుడా! శ్రీరామా! మీ యనుగ్రహము చేత నీ పండ్రెండు సంవత్సరములు పుణ్యక్షేత్రముల సేవించి యాత్ర సలిపితిని. ఈ యాత్రలో నే పుణ్యము సంపాదించితినో యది యెల్ల శ్రీరామార్పణ మని మీకర్పించెదను. కరుణించి స్వీకరింపుము" అని పలికి శ్రీరాముని హస్తములలో జలము ధారబోసెను. ఈ యాత్ర యంతయు రామదాసుడు జీవనాధారము లేక, చేత ధన మేమియు లేక కాలినడకనే జరిపె నని పాఠకులు గ్రహింతురుగాక. రామదాసుడు పాదచారియై పోవుటచేత భరత ఖండమున గల మండలము లన్నిటిలో జనుల యాచార వ్యవహారములను గ్రహించుట కవకాశము గలిగెను. ఈనాటి యాత్రలకు, రామదాసుడు పదునేడవ శతాబ్దమున జేసిన యాత్రలకు జాల భేదము గలదు. ఈ నాటివారు. ఓడలలోను, ధూమ శకటములలోను నెక్కి పయనములు చేయుదురు. ఆంగ్లేయ కనియైన 'రస్కిను' అను నతడు "రైలు ప్రయాణము నిజమైన ప్రయాణము కాదు" అని వక్కాణించెను. ఏలయన నొక బంగీ పొగబండిలో బడవైచి యొక చోటనుండి మరియొక చోటికి బంపినట్లే మనుష్యుని గూడ నొకచోట బొగబండిలో నెక్కించి మరియొకచోట దింపుదురు. కాన నది నిజ మయిన ప్రయాణము కా దని యతడు పలికెను. నిజముగ రామదాసుని మతసంబంధమైన తీర్థయాత్రయైనను, నత డేగిన చోట నెల్ల నక్కడి స్థితిగతు లన్నిటిని దన భవిషత్కార్యమునకు