పుట:SamardaRamadasu.djvu/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ననుకూలముగ జేసికొనునట్లు గ్రహించెను. ఒక స్థలమందు నతడిట్లు చెప్పెను. "ఈ ప్రపంచ మనేక విధములైన మనుష్యులతో నిండియున్నది. వారినడుమ సంచరించుటవలన మన కెంతో జ్ఞానము కలుగును. అదిమన కాశ్చర్యము గొలిపి యెన్నో జీవిత సమస్యలను సాధించును. కనుక మనము నిరంతరము ప్రయాణము చేయవలెను. నూతన ప్రదేశములను దర్శింపవలెను. దానివలన ననేక దేశముల పరిచయము మనకు గలుగును. అనేక తపస్సులు చేయవలెను. అనేక పుణ్యక్షేత్రముల సేవింప వలెను. వైరాగ్యము కలిగి యుండవలెను. స్వార్థత్యాగముచేత నూతన శక్తులెన్నో ప్రభవించును." ఈ శక్తివల్లనే యతడు శివాజీకి సాయము చేయకలిగెను. తాను స్వయముగ బాదచారియై యాత్ర సల్పి రామదాసుడు తక్కినవారికి మార్గదర్శకుడయ్యెను. ఈనాడు లోకసేవజేయ బ్రయత్నించువారు విఫలప్రయత్ను లగుటకు ముఖ్యకారణము జన సామాన్యముతో సంబంధము లేకపోవుటయే. జనులతో గలసి మెలసి యుండని వాడు జనులపక్షమున గట్టిగ బని జేయలేడు. కావున రామదాసుడు నానావిధములైన జనులతో మనము సంబంధము కలిగి యుండవలెనని బోధించుచుండును. కూపస్థమండూకము వలె నొకచో గూర్చుండెడివాడు సకల వ్యవహారములు చెడగొట్టుకొనును. కావున దేశాటనము చేసి యనేకులతో సంభాషింపవలెను.


________