మాటాడక మౌనముతో వారివెంట విశ్వేశ్వరాలయమునకు బోయెను. పోయిన తోడనే లింగమెప్పటియట్ల గుడిలో గనబడెనట. అడ్డుపెట్టిన వారి గర్వభంగ మయ్యెనట. కాశినగరములో నున్న దివ్యస్థలము లన్నియు నతడు సేవించెను. అన్నిటికేమి గాని యచ్చట హనుమాన్ ఘట్టమని యొక ఘట్టము గలదు. పేరు హనుమాన్ ఘట్టమేగాని యచ్చట హనుమంతుని యాలయము లేదు. రామదాసుడు మారుతి దేవాలయము గట్టించి, యందు హనుమంతుని విగ్రహము నెలకొల్పి పూజా నమస్కారములు ప్రతి దినము చేయు మని బ్రాహ్మణులకు జెప్పెను. కాశీపురి నుండి రామదాసు డయోధ్యాపురి కేగెను. అయోధ్యాపుర దర్శనము కాగానే యతని యానందము మితిమీఱెను. సూర్యవంశ ప్రదీపకుడు, పితృవాక్య పరిపాలకుడు, పరమదైవతము నైన శ్రీరాముడు పుట్టిన చోటును, ఆ మహానుభావుడు రాజ్యమేలిన చోటును గనుగొను భాగ్యము తన కబ్బిన దని యత డానంద పరవశు డయ్యెను. అతడక్కడ గొన్నిదినములు గడపి పిమ్మట మధురాపురము, గోకులము, బృందావనము, మొదలైన దివ్యక్షేత్రముల సేవించెను. ఆతని రాక విని జనులు మహానుభావుడగు నతని దర్శనము చేసి యాశీర్వచనము పొంద జనులు గుంపులు గుంపులుగ జేరిరి. ఏలయన నతని కీర్తి యతనికంటె ముందే యచ్చటికి జేరెను. రామదాసుడు తనకు జిక్కిన యవకాశములను వ్యర్థముగ బోనిచ్చువాడు గాదు. అందుచే నతడు అచ్చట కొందఱి కుపదేశములు చేసి మఠములు స్థాపించి తన బదులుగా బనిచేయుమని వారిని నియోగించెను. అతని పనికి నదే ప్రారంభము. కాని యతడుత్తర హిందూస్థానమున నధికముగ మతవ్యాప్తి చేయదలచుకొనలేదు. తన యావచ్ఛక్తిని దనకాలమును దన జ్ఞానమును మాతృదేశమైన మహారాష్ట్రమునకే సమర్పింపవలె నని యతని నిశ్చయము. అత డంతట శ్రీకృష్ణునకు మున్ను నివాసమైన ద్వారకానగరమునకు పోయి యచ్చట నొక శ్రీరామాలయము స్థాపించి సంప్రోక్షణాది కర్మలు గావించి యచ్చట నుండి కాశ్మీరమునకు రాజధానియైన శ్రీనగరమునకు బోయెను. అచ్చట శిక్కుమత స్థాపకుడైన నానక్ గురువుచేత స్థాపింపబడిన మఠము కలదు.
పుట:SamardaRamadasu.djvu/21
Appearance