క. కులగిరులు పెఱుకు సత్త్వము
గల పురుషుఁడు తృణముఁ బెఱుకఁగడఁగునె మదిలోఁ
దలపోయ నట్లపోలెను బలహీనున
కరుగఁజొరఁడు ప్రబలుం డెపుడున్. 963
ఆ. అరుల బలుని నబలుఁ డనిలోన నలిగినఁ
జేట కాని యొకటిఁ జేయలేఁడు
సనగగింజ పెటిలి చనుఁగాక మంగలం
బనియఁ జేయఁగలదె యరయ నెందు. 964
గీ. వఱలుమైత్రివివాహోత్సవమ్ము సేయ
సిరులు నెఱుకలు సమమైన పురుషు లెవ్వ
రరయ వారికిఁ దమలోన నమరుఁగాని
మునులకును నీచులకుఁ బొందు గలుగదెందు. 965
గీ. కదియ నోరికి దళమైన కడియ కాని
వెగ్గలము గొన గ్రుడ్డులు వెలికి నుఱుకు
కాన యభియాతిజయకాముఁ డైనవాఁడు
చేత నయ్యెడుపని గాని చేయవలదు. 966
పంచతంత్రి
ఆ. ఎదిరివాని సత్త్వ మెఱుఁగక పైఁబడి
సీయదగదు గాక చేసెనేని
నతఁడు గీడువొందు నల టిట్టిభముచేత
నబ్ధి గీడు వొంది నట్ల వోలె. 967
చోరనీతులు
క. మ్రుచ్చిలుటయుఁ బాతకముగ
మ్రుచ్చిలమియు ధర్మముగను మున్నుపదేశం
బిచ్చిరి పూర్వమునీంద్రులు
మ్రుచ్చిలకుండునది యెరుల మొల్లములు జనుల్. 968
క. ధనమునకు బ్రాణమమ్ములు
ధనమునకేఁ బ్రాణ మీగి దలఁప జనులకున్
ధనమది ప్రాణుల ప్రాణము
ధరహారిత ప్రాణహారితకుఁ దక్కువయే. 969