క. ప్రాణిదయఁ జేసి చోరుని
ప్రాణములకుఁ దెగని భూమిపతి కాజ్ఞలచేఁ
బ్రాణులనేకులు విగత
ప్రాణులుగాఁ జూచునది కృపాభావమొకో. 970
క. ఖలునొకని జంపమియె సా
ధులఁ బలువురఁ జంపినట్ల దొర కొనినను గ్రో
ల్పులిఁ జంపసునికి చాలదె
చలమున గోసమితి వేఱ చంపఁగ నేలా. 971
క. భూవరుఁడు కూర్మి గలిగినఁ
బ్రోవందగు జనవుగలిగి భూప్రజకహితో
ద్భావియగు మ్రుచ్చు గావం
గా వచ్చినవాని మ్రుచ్చుగాఁ దలఁపఁ దగున్. 972
శత్రునపనమ్మికనీతులు
ఆ. అబలుఁ డైనఁ జిక్కఁ డతిబలుచేతను
నెదిరి కెపుడు మర్మ మీనివాఁడు
మర్మ మిచ్చెనేని మదియెంత బలవంతుఁ
డైనఁ జిక్కునొక్క యబలు చేత. 973
ఆ. దేవగురుని బోలు ధీమంతుఁ డైనను
వేగ మొరుల వలదు విశ్వసింప
విమల యశము సుఖము విత్తంబు వృద్ధియు
వర్ణనీయ జయము పడయువాఁడు. 974
క. అమరులకైనను విశ్వా
సము వెలిగాఁ జెఱుపరాదు శత్రులవిశ్వా
సముననకాదే దితి గ
ర్భము శక్రుఁడు సొచ్చివ్రచ్చి పాఱఁగవైచెన్. 975