Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. కాకములఁ ద్రుంచు రాత్రియు
ఘూకము కాకంబు పగలు ఘూకచయంబున్
జేకొని త్రుంచుం గావున
గైకొనఁగా వచ్చుఫలము కాలముతోడన్. 892

క. దరినుండి తిగుచు శునకం
బురువడి నక్రమును నక్ర ముదకస్థితమై
బొరిఁబొరి నేనుఁగుఁ దిగుచుం
బరవసమునఁ గాన దేశబల మొప్పు ననిన్. 893

కామందకము



ఉ. మానుగ శత్రునైన నభిమానము సేయక చొచ్చివాఁడు దన్
హీనము గాఁగఁ బల్కిన సహించుచుఁ బ్రాజ్ఞుఁడు శక్తియుక్తియున్
గానఁబడంగనీక పొసఁగం ధృతిపెంపును గప్పికొంచు నిం
పూనఁగ వారి గెల్వవలయుం దనకార్యము లైనయంతకున్. 894

పంచతంత్రి



క. అరివధకుం దగునంతకు
ధరణీశుం డోర్వవలయుఁ దక్కువ యైనన్
నరుఁ డాఁటదయ్యు నుండఁడె
హరి గొల్లఁ డనంగఁ బడఁడె యనువగుదాఁకన్. 895

నీతిభూషణము


క. పగ యడఁప దలఁచునాతఁడు
పగతుని పగవానిఁ గూడి .................
......................................
....................................................... 896

గీ. వేఱయొకచోట వలయొగ్గి వేఁటకాఁడు
తొలఁగియుండు మృగంబులఁ ద్రుంచుపగిది
రూపుసూపక శత్రువు రూపుఁ గూల్చు
టిదియె నయమార్గ మిట్లు జయింపవలయు. 897

ముద్రామాత్యము



క. బలవంతునైన నాతని
బలమది మానవుల మిగులఁ బ్రకటింపమియుం
దలఁప శమీకాష్ఠములోఁ
గలదను ననలంబువోలెఁ గైకొన రెందున్. 898

క. బలమును గుణమును శీలముఁ
జలమును సత్త్వంబు సాహసంబును ధృతియున్
గలుగని పురుషుని నవనీ
స్థలిలోపలఁ దృణము గాఁగఁ దలఁతురు మనుజుల్. 899

పంచతంత్రి