పుట:Sakalaneetisammatamu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెగడిన నీతిశాస్త్రములు నిచ్చలుఁ జెప్పెడివాఁడు శుక్రుఁ డీ
జగమున నట్టి రావణుఁడుఁ జచ్చెన కాక మనంగ నేర్చెనే. 883

మ. చెలువం బేది యరణ్యవాసగతులై శ్రీరాముఁడున్ బాండవే
యులు చేబొందిరి వృష్టివీరు లురుదైత్యుం డైన లంకేశుఁడుం
గలఁగె న్మర్త్యులచే నలంగె నలుఁ డీకష్టంపురాజ్యంబుకై
తలపోయం గడుదుఃఖహేతు విది వ్యర్థం బొప్ప దాసింపఁగన్. 884

క. ఆరాజ్యమునకు రాజులు
ధారుణిలోఁ దండ్రి నన్నఁ దమ్ముని సుతులన్
దారు వధింతురు గావున
దూరమునన యడఁగి చూచి తొలఁగఁగవలయున్. 885

పంచతంత్రి



గీ. పరుఁడు తనకుఁ దగనిపాటు సంబంధంబు
గలుగఁ జూచికాని కలయవలదు
చేరినపుడ తన్నుఁ జెఱిచినయాతఁడ
యయ్యెనేమి పగతుఁ డయ్యెనేమి. 886

ఆ. బలియుఁ డెత్తిరాఁగ బలహీనుఁ జేరుట
దంతియెదుర నుఱిమితప్పఁబాఱు
వఱదఁ బోవువాని వఱదఁబోయెడివాఁడు
పట్టు టాత్మసమునిఁ బట్టియునికి. 887

ఆ. వలయు నాశ్రయింపఁ బలువురిఁ బెక్కండ్రు
జేరినతని కెపుడు చేటు లేదు
పిల్లవెదుళు లొప్పఁ బెనగొన్న వెదురొంటి
వెదురువోలె వశమె వేగ నఱక. 888

క. ఒక్కరుని నాశ్రయించిన
పెక్కుండ్రును జత్తు రొక్కపృథుబలయుతుచేఁ
బెక్కు మహీరుహములు ధర
నొక్క మహానలము చేతనొఱఁగినమాడ్కిన్. 889

ఆ. జగతిఁ బొగడ నెగడు సజ్జనాశ్రయమున
నెవ్వఁడుండె నెనకమెసఁగుపెంపు
జలజపత్రయుక్తజలము ముక్తాఫల
శ్ర వహించినట్టి చెలువు దోప. 890

క. పెనుగజము ద్రుంచునక్రము
కననెలవున నుండి నెలవు దప్పిన మఱి తా
శునకంబుచేతఁ జచ్చుం
దననెలవున హీనుఁడైనఁదగ ఘను నోర్చున్. 891