పుట:Sakalaneetisammatamu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ. సామదానములఁ బ్రశాంతిఁ బొందని శత్రు
నందు వలయుభేద మొందఁజేయ
భేదమునన యెట్టి పృథుసత్త్వుఁ డైనను
బొల్లయై నశించిపోవుఁ గాన. 614

క. బలముల గిరులను గపటం
బులచెలుముల భిన్నమంత్రములఁ గార్యములన్
లలినొక్కశబ్దమాత్రన
పెలుచన కడుఁగాతరుండు భేదం బొందున్. 615

పంచతంత్రి

దండోపాయము

క. వధయు సకలార్థహరణము
నధికక్లేశంబు ననఁగ నట దండవిధా
విధినిరతులచే దండన
మధిగుణవినుతముగఁ ద్రివిధమై చెలువొందున్. 616

సీ. అరయఁ బ్రకాశంబు నప్రకాశం బన
వధ రెండు తెఱుఁగులై వఱలుచుండు
నుఱక ప్రకాశనం బొనరించునది లోక
విద్విషుం డైనట్టి వినుతుమీఁద
నప్రకాశనదండ మడరించునది రాజ
వల్లభలై మఱి యెల్లజనుల
కుద్వేజనము సేయుచుండెడివారి
పై నధికులై భావించునట్టివారి
ఆ. విషహుతాశనాది వివిధమార్గముల ను
ద్వర్తనముల నాయుధములచేత
నిట్లు పాంశుదండ మెవ్విధమున యథా
న్యాయమార్గమున నొనర్పవలయు. 617

గీ. తనర విప్రుండు జాతిమాత్రకుఁడె యైన
ధార్మికుం డగునాతఁ డంత్యజుఁడ యైన
వారిపై వధదండముల్ వల దొనర్ప
ధర్మసంగ్రహవిదుఁ డైన ధరణిపతికి. 618

ఆ. ధరణిలో నుపాంశుదండార్హు లెవ్వార
లందుఁ జంపదగినయట్టివారిఁ
బరఁగ బాధపెట్టఁ బరఁగ నుపేక్షింప
వలదు నెదురనైన వల దుపేక్ష. 619

చ. యముఁడునుబోలె నేరికి భయంకరమై కదియంగదార దం
డమునకుఁ బాత్రు లందుఁ బ్రకటం బగుదండనసేయు టొప్పు భూ
రమణుఁడు మ్రోలఁజంపు టెదురన్ విడిపించుట లిట్టిచందముల్
దమకము లే కెఱుంగని విధంబునఁ జేయు టయుక్త మారయన్. 620