మనోమోదంబు గావించి నట్ల దండనంబునఁ బొందినయతండును, దండాధికారియు నన నియ్యేవురుఁ గ్రోధవర్గంబు; భీతిదోషంబున రాజువలన వెఱచుచుండు వాఁడును, నవనీశ్వరజ్ఞాతియు నాత్మదోషంబుననొండె, వైముఖ్యంబున నొండె నితరంబును భూవల్లభుచే దూషింపబడునతండును నీ మువ్వురును భీతవర్గంబు; నైసర్గికంబైన యభిమానంబు గలయతండును, మానాధికుం డగుట పరామర్శింపక మహాసాహసంబు సేయునతండును, విద్యాభిజనధనమదోద్వర్తుండై యాత్మశ్లాఘ చేసికొనునతండును, నీ మువ్వురు మానివర్గంబు; ధనహీనుం డగుట ధర్మకామార్థవిరహితుం డైనయతండును, జ్యేష్ఠుం డైనయతండును, బరిచరితుం డైనమానియు, నాత్మదుష్కార్యశంగాభీతుం డైనయతండును, బూర్వమున విరోధియై సమాధానంబునఁ బొందిన యతండును, నీచుతోఁగూడం బనిసేయం బంపువడ్డవాఁడును, దనసరివారిచే మాటఁబడ్డవాఁడును, దనదుఃస్వభావంబున నొక్కనెపంబున బంధనప్రాప్తుం డైనయతండును, నిమిత్తంబు లేక వెడలఁబాటుపడ్డయతండును, నపూజితపూజార్హుండును, హృతద్రవ్యకళత్రుం డైన భోగాభిలాషుండును, బరీక్షీణుండును, బహిష్కృతుండును నన నిట్లు సెప్పంబడిన యిన్ని దెఱంగులవారలును భేదార్హులుగా నెఱుంగవలయు. 609
గీ. సామమును నాసపెట్టుట చతురతయును
దారుణాత్యుగ్రరసభయదర్శనంబు
మహిమవస్తుప్రదానంబు మన్ననయును
ననఁగ భేదంబునకు నుపాయంబు లయ్యె. 610
క. బలియుండు నిగ్రహించిన
నలవడ భేదం బొనర్చునది బుద్ధిమెయిన్
బొలుపుగఁ జండామార్కుల
గెలుచుట భేదమునఁ గాదె గీర్వాణు లొగిన్. 611
కామందకము
క. అతులితబలనృపుఁ డైనను
నతిరయమున భేదసాధ్యుఁ డగుఁ గావున నీ
క్షితిజయముఁ గోరినను భూ
పతి భేదము సేయవలయుఁ బాయక యతనిన్. 612
గీ. ధరణి నవిరోధకృన్మంత్పతంత్రతతులు
గడు సువృత్తసుహృద్వ్యక్తికంబు లయ్యు
సరయ నించుక లోభేద మగుటఁ జేసి
బంధనప్రాప్తములు గావె పాయ కెపుడు. 613