గీ. తొలుత భేదంబు గావించి తొడరి పిదప
హనన మొనరింపవలయు దండన మొనర్చి
కమియఁ దఱిమినఁ జివికిన కాష్ఠ మరయ
నఱకఁ బూనినమాత్రన నుఱుముఁగాదె. 621
క. వెస దేశకాలబలమును
సుసహాయోత్సాహబలము శోభిల్లంగా
నెసఁగి యుధిష్ఠిరు పోలిక
ననమున శత్రువులఁ ద్రుంచునది దండమునన్. 622
క. భీకర మగు నాత్మభుజ
శ్రీకలిమిన యైన శత్రుఁ జెండాడఁదగున్
ఏకాకి యగుచు రాముఁడు
పోకార్పఁడె బాహుదర్పమున నృపకులమున్. 623
ఆ. సామభేదదానసంప్రయోగము గడు
విఫలమైన యెడ వివేకి యగుచు
దండమార్గ మెఱిఁగి దండ్యుల దండింప
వలయు నెపుడు భూమివల్లభుండు. 624
కామందకము
ఆ. అఖిల మైనవారి కది మనోహరలక్ష్మి
నలిగియుండుఁగాని తలఁచిచూడ
అతులదండనీతియుతులకు నెప్పుడు
ప్రథనలక్ష్మి వశ్యమై దనర్చు. 625
గీ. అరయ దండంబు దక్క సామద్యుపాయ
లబ్ధ మగు లక్ష్మి నృపతికి లక్ష్మి యెట్లు
దైవ మిచ్చినఁ బులి దించుఁ దరలలేక
యుండు ముదిగోద యదియును నొక్కటగునె. 626
గీ. సామదానభేదంబులఁ జక్కఁబడక
తక్కెనేనియు మఱికాక తగదుమున్న
దండ మదియేల యనవుడు దండనీతి
యుర్విపులకెల్ల దుర్గతి కూఁత యగుట. 627
ఆ. దండనీతి వదలి తక్కినయమ్మూఁటి
నమర నడపురాజు కహితులెల్ల
భీతుగాఁ దలంచి పెలుచన పైనెత్తి
వరువుఁబోలె నడపవత్తు రెపుడు. 628
అజ్ఞాతము
గీ. సామదానములందు నసాధ్యుఁడైన
మంత్రిజనబంధుభేదంబు మఱియొనర్చి
పిదప దండన మొప్పగు నదియు గూడ
రూఢచేష్టల రెండయి రూఢికెక్కు. 629
ఆ. దండనీతి లేక తక్కినవిద్యలు
గలిగెనేని లేనిగతిన పొందు
రాజు దండనీతిరతుఁడైనఁ దక్కిన
విద్యలెల్ల నతని వెదకిపొందు. 630